అందుకు ‘మరేదో’ అవసరం!

On Kamal Haasan And Success In Politics, Rajinikanth's Joke

రాజకీయాల్లో విజయానికి సినీ గ్లామర్‌ సరిపోదు

ఆ రహస్యం కమల్‌హాసన్‌కు తెలుసేమో

రజనీకాంత్‌ నర్మగర్భ వ్యాఖ్యలు

చెన్నైలో శివాజీ గణేశన్‌ స్మారకమందిరం ప్రారంభం

కార్యక్రమంలో పాల్గొన్న రజనీ, కమల్‌

తమిళసినిమా (చెన్నై): సినిమాల వల్ల పొందిన గుర్తింపు, ప్రఖ్యాతి.. రాజకీయాల్లో విజయం సాధించడానికి సరిపోతాయని తాను భావించడం లేదని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో విజయవంతమవడానికి ఈ లక్షణాలకు మించిన మరేదో అవసరమన్నారు. తన సహనటుడు కమల్‌హాసన్‌కు ఆ ‘మరేదో’ తెలిసి ఉండొచ్చని, ఆయన దాన్ని తనతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదని రజనీ చమత్కరించారు. ‘అయితే, రెణ్నెళ్ల క్రితం అడిగి ఉంటే ఆ రహస్యాన్ని కమల్‌ నాకు చెప్పేవాడేమో. సినీరంగంలో మీరే నాకు సీనియర్‌. పెద్దన్న లాంటివారు.

 కాబట్టి ఆ రహస్యం చెప్పండి అని అడిగితే నాతో కలిసి రండి చెప్తాను అనేవాడేమో’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. శివాజీ గణేశన్‌ తన సినిమాల ద్వారా ఎంతో పేరుప్రఖ్యాతులు గడించినప్పటికీ రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారని రజనీ గుర్తుచేశారు. సొంతంగా పార్టీ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేసిన శివాజీ గణేశన్‌ సొంత నియోజకవర్గం నుంచే ఓటమి పాలైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ ఓటమి ఆయనకు అవమానం కాదని, ఆ నియోజకవర్గ ప్రజలకు అవమానమని పేర్కొన్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌ల రాజకీయ రంగప్రవేశంపై ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు, కథనాలు రావడం తెలిసిందే.

 చెన్నైలో ఆదివారం ఉదయం నడిగర్‌తిలకం, సెవాలియర్‌ శివాజీగణేశన్‌ స్మారకమండపాన్ని ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శివాజీగణేశన్‌ కుటుంబసభ్యులతో పాటు రాజకీయ వైరానికి అతీతంగా పలువురు మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు కమలహాసన్, రజనీకాంత్‌ ప్రత్యేక అతిథులుగా విశ్చేశారు.

ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ.. సినిమాల్లో రాజులు, స్వాతంత్య్ర సమరయోధుల పాత్రల్లో జీవం పలికించిన శివాజీ.. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. తమిళనాడులో నాస్తికత్వం అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో శివాజీ గణేశన్‌ నుదుట విభూతితో కనిపించేవారని గుర్తు చేశారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చాలా అదృష్టవంతుడని ఇప్పటికే చాలాసార్లు రుజువైందనీ, ఇప్పుడు మహా నటుడు శివాజీగణేశన్‌ స్మారకమండపాన్ని ఆవిష్కరించి మరోసారి అదృష్టవంతుడని నిరూపించుకున్నారని పేర్కొన్నారు.  

ఏ ప్రభుత్వమున్నా తప్పదు..
శివాజీకి తాను పెద్ద అభిమానినని, ఒకవేళ సినీరంగంలోకి వచ్చి ఉండకపోయి.. ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేని పరిస్థితుల్లోనూ తాను ఇక్కడికి వచ్చేవాడినని, కాకపోతే బయట వేచి చూస్తూ ఉండేవాడినేమోనని కమల్‌హాసన్‌ అన్నారు. నటుడిగా, వ్యక్తిగా అన్ని హద్దులనూ బద్దలు కొట్టిన నటుడు శివాజీ గణేశన్‌ అని కమల్‌ ప్రశంసించారు. శివాజీ గొప్పదనాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనను గౌరవించక తప్పదు. అందుకు ఎవరినీ అభ్యర్థించాల్సిన అవసరం లేదు. అది అలా జరిగి తీరుతుందంతే’ అని కమల్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top