సొంత ఇంట్లోనే వేశ్యవృత్తి....

సొంత ఇంట్లోనే వేశ్యవృత్తి....

♦ భర్తలకు తెలిసే వేశ్యవృత్తిలోకి వివాహితలు..

♦ వేశ్యల జీవన విధానంపై నివేదిక అందజేసిన జయమాల కమిటీ..

♦ పేదరికంతోనే ఈ వృత్తిలోకి..

 

బెంగళూరు: కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే స్వంత ఇంట్లోనే పడుపువృత్తి నిర్వహించేవారి సంఖ్య ఎక్కువగా ఉందని సెక్స్‌ వర్కర్లపై అధ్యాయనం చేసిన కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల జీవన విధానం పై అధ్యయనం చేయడానికి జయమాల అధ్యక్షతన కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాది పాటు రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఈ కమిటీ క్షేత్రస్థాయి పర్యటన జరిపింది.

 

ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ వృత్తిలో ఉన్నవారితో స్వయంగా మాట్లాడింది. మొత్తం 169 ప్రశ్నావళికి సమాధానాలు రాబట్టి బృహత్‌ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సెక్స్‌వర్కర్ల జీవన విధానం మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలు కూడా  కమిటీ అందులో ప్రస్తావించింది. 

 

► ఇక ఈ కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రధాన అంశాలు ..

 

 •  పేదరికం, కుటుంబ పెద్ద అనారోగ్యం ఈ వృత్తిలోకి రావడానికి మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. 

 • సొంత తల్లిదండ్రులు, అన్నదమ్ములే బలవంతంగా మహిళలను ఈ వృత్తిలోకి  నెడుతున్నారు. 

 • రాష్ట్రంలో ఉన్న మొత్తం సెక్స్‌వర్కర్లు 1,00,676 కాగా ఈ విషయంలో బెంగళూరు నగర (21,327) జిల్లా మొదటి స్థానంలో ఉండగా అటు పై వరుసగా బళ్లారి(5,520), విజయపుర (5,336) జిల్లాలు ఉన్నాయి. 

 • రాష్ట్రంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న సెక్స్‌వర్కర్లు 459 వీరిలో ఎక్కువ మంది అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన బెళగావి జిల్లా (240)లో ఉన్నారు. అటు పై స్థానాల్లో ధార్వాడ (55), విజయపుర(43)లు ఉన్నాయి.

 • ఈ వృత్తిలో ఉంటున్నవారిలో 38.4 శాతం మంది వివాహితులు కాగా, 6 శాతం మంది అవివాహితులు. 10.8 శాతం మంది విడాకులు తీసుకున్నవారు. 19.3 శాతం మంది వితంతువులు. 2.1 శాతం లివింగ్‌ టు గెదర్‌ విధానంలో ఉన్నవారు. 2.2 శాతం రెండో పెళ్లిచేసుకుని ప్రస్తుతం రెండో భర్తతో ఉన్నవారు. 0.8 శాతం మంది రెండు అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నవారు. మిగిలిన 20.4 శాతం మంది పెళ్లి సంబంధ విషయాలను చెప్పడానికి ఇష్టపడలేదు. 

 •  సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే 36.8 శాతం మంది ఎస్సీ వర్గానికి చెందినవారు కాగా, 6.8 శాతం మంది ఎస్టీ, 18.2 శాతం మంది ఓబీసీ, ఇతరులు 38.2 శాతం మంది.

 • ఈ వృత్తిలో ఉంటూ హెచ్‌ఐవీతో బాధపడుతున్నవారి సంఖ్య 8వేలు

 • వయస్సు మీదపడిన వారు తమ ఇంటిని  వేశ్యలకు అద్దెకు ఇస్తూ గంటకు కొంత సొమ్మున వసూలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 

 • ఈ దందాలో ఉన్న మహిళలు సంపాదించే సొమ్ములో దాదాపు 40 శాతం ఇతరులకు వెళుతోంది. ముఖ్యంగా దళారులకు, పోలీసులకు, స్థానిక రౌడీ, గుండాలకు చెల్లిస్తున్నారు. 

 •  హైదరాబాద్‌–కర్ణాటక ప్రాంతంలో సొమ్ము బదులు వస్తువులు తీసుకొంటూ ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఇందులో మొక్కజొన్నలు, జొన్నలు వంటివి కూడా ఉన్నాయి. 

 •  మామిడి పంటకు పేరు గాంచిన కోలారు జిల్లా శ్రీనివాసపురలో మామిడి పంట చేతికి వచ్చే సమయంలో ఈ దందా ఎక్కువగా జరుగుతోంది. ఆ సమయంలో శ్రీనివాసపురానికి చెందిన ఉత్తర కర్ణాటక మహిళలు కూడా వస్తుంటారు. 

 •  రాష్ట్రంలోని గ్రామాజాతరలు జరిగే సమయంలో మాత్రమే సెక్స్‌వర్కర్లుగా మారేవారు  కూడా ఉన్నారు. 

 

► సెక్స్‌వర్కర్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన చేయూత ఇలా....

 

 •  రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల సంక్షేమం కోసం రూ.733 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. 

 •  45 ఏళ్లు దాటిన వారికి అంత్యోదయ కార్డుతో పాటు రూ.5వేలను ప్రతి నెలా ఇవ్వాలి. 

 •  హెచ్‌ఐవీతో బాధపడుతున్నవారికి ఉచిత మందులు ఇవ్వడంతో పాటు రూ.5వేలను ప్రతినెలా చెల్లించాలి. 

 •  ఈ వృత్తి నుంచి బయటపడాలనుకునేవారికి రోజుకు రూ.300 ఇస్తూ వివిధ వృత్తి విద్యల్లో శిక్షణ ఇవ్వాలి. 

 •  సొంతంగా వ్యాపారం, పశుపోషణ తదితర విషయాల పై ఆసక్తి కలిగిన మహిళలకు రూ.1 లక్షకు ఎటువంటి వడ్డీ, తనఖా లేకుండా రుణాలు ఇవ్వాలి. 

 •  ఏడాదికి కనీసం 1,000 మంది సెక్స్‌వర్కర్లకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. 


 


►నివేదికలో కొన్ని కళ్లు చమర్చే ఘటనలు ...


 


♦ 14 ఏళ్ల అమ్మాయి వెల రూ.15వేలు...

విజయపురకు చెందిన 14 ఏళ్ల అమ్మాయిని ఒక వ్యక్తి ఉద్యోగం చూపిస్తానని చెప్పి మైసూరుకు తీసుకువచ్చాడు. ఒక ఇంట్లో తనతో పాటు 15 రోజుల పాటు ఉంచుకుని అమ్మాయిని అన్ని విధాలుగా దోచుకున్నాడు. అటు పై వారం పాటు మరో వ్యక్తి కూడా తన క్రూరత్వం చూపించారు. చివరికి ‘మీ నాన్నకు రూ.15 వేలు ఇచ్చి నెల రోజుల పాటు నిన్ను ఇక్కడకు తీసుకువచ్చాం.’ అని చెప్పారు.  సమయం ముగిసిన తర్వాత ఇంట్లో వదిలేశారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఈ వృత్తిలో ఉంటోంది. ప్రస్తుతం ఆ అమ్మాయి వయస్సు 16 ఏళ్లు. 
Back to Top