కన్నీటి సంద్రం

Floods And Heavy Rains In Kodagu District Karnataka - Sakshi

కకావికలమైన కొడగు జిల్లా  

వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులు  

గంజి కేంద్రాలు కిటకిట  

సహాయక చర్యలు ముమ్మరం  

జిల్లాకు మంత్రులు, నేతల క్యూ  

పచ్చని లోయలు, అందమైన భవనాలు, విశాలమైన కాఫీ, వక్క తోటలతో అలరారే కొడగు జిల్లా వరదలకు తల్లడిల్లుతోంది. రోడ్లు, వంతెనలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. కనీస వసతులూ కరువు కాగా లక్షలాది మంది బాధితులు ఆపన్నహస్తం కోసం దిక్కులు చూస్తున్నారు. వరుణుని శాపానికి పర్యాటకుల స్వర్గం నేడు కళావిహీనమైంది.

సాక్షి, బెంగళూరు: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వరదలతో కొడగు జిల్లా అతలాకుతలమైంది. లక్షలాది మంది జిల్లావాసులు తీవ్రంగా నష్టపోయారు. నిరాశ్రయులుగా గంజి కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వేలాది నివాసాలకు విద్యుత్, మంచినీరు సదుపాయాలు దూరమయ్యాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి సహాయం కోసం బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే పలు వాహనాలు విరాజపేటె, కుశాలనగర, మడికెరి ప్రాంతవాసులకు ఆహారం, నీళ్లు, ఔషధాలు, దుస్తులతో కూడిన సామగ్రితో చేరుకుంటున్నాయి. జిల్లావ్యాప్తంగానున్న సుమారు 34 గంజి కేంద్రాలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్మీ, వాయుసేన, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.  

స్తంభించిన రవాణా  
సహాయక దళాలు ఇప్పటికే కొన్ని వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మడికెరి, కుశాలనగర, విరాజపేటె తదితర ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ నీటిమట్టం తగ్గలేదు. ఆయా ప్రాంతాల్లో 100 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సుమారు 50 చిన్న చిన్న వంతెనలు కూలిపోయాయి. రవాణా పూర్తిగా స్తంభించింది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కాగా ముక్కోడ్లు, ఇగ్గోడ్లు గ్రామాల్లో ఇప్పటికీ 60 మంది ఇంకా ప్రమాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. మడికెరిలో ప్రవాహ పరిస్థితులను పరిశీలించేందుకు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే అప్పచ్చిరంజన్, జిల్లా ఎస్పీ పన్నేకర్‌ వెళ్లారు. అయితే శనివారం రాత్రి నుంచి జడివాన కురవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి బీటలు వారడంతో ఎమ్మెల్యే, పోలీసులు ప్రమాదంలో చిక్కుకుపోయారు. అయితే అగ్నిమాపకసిబ్బంది, డీజీపీ ఎంఎన్‌ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు రక్షించారు. 

మంత్రుల పర్యటనలు  
వైద్య విద్య శాఖ మంత్రి డీకే శివకుమార్‌ సూచన మేరకు వైద్య సిబ్బంది కొడగుజిల్లా ప్రజల సహాయార్థం ఒక్కరోజు వేతనం విరాళమివ్వనున్నారు. ప్రజాపన్నుల మంత్రి హెచ్‌డీ రేవణ్ణ గంజి కేంద్రాలను పరిశీలించారు. మంత్రులు ఆర్‌వీ దేశపాండే, సా.రా.మహేశ్‌ వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప బీజేపీ నేతలతో కలిసి మడికెరిలో పర్యటించారు.  

మైసూరులో నదుల జోరు  
కొడగు పొరుగు జిల్లా మైసూరులో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కబిని, కేఆర్‌ఎస్‌ జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. కపిలా నది పొంగిపొర్లడంతో దక్షిణ కాశిగా నంజనగూడులో పలు దేవస్థానాలు నీట మునిగాయి. కేఆర్‌ఎస్‌ నుంచి నీరు భారీస్థాయిలో విడుదల అవుతోంది. శ్రీరంగపట్టణంలోని మేళాపురం గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ జలావృతమైంది. హారంగి జలాశయానికి ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలు భయాందోళన వీడాలని అధికారులు సూచించారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top