దీప కొత్త పార్టీ?


► శ్రేయోభిలాషులతో సమాలోచనలు

►బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆరా

►బలపడుతున్న దీప పేరవై




సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే లక్ష్యంగా రాష్ట్రంలో మరోకొత్త పార్టీ ఆవిర్భవించనుందా? దివంగత ముఖ్యమంత్రి జయలలిత అన్నకుమార్తె దీప కొత్త పార్టీకి సారథ్యం వహించనున్నారా? అవును, ప్రస్తుతానికి ఇవి ఊహాగానాలే అయినా పూర్తిగా కొట్టిపారేయలేమని అంటున్నారు రాష్ట్రం లోని రాజకీయ విశ్లేషకులు.



జయలలిత మరణంతో రాష్ట్రం లో ఒకరకమైన రాజకీయ శూన్యత ఏర్పడింది. బలమైన అన్నాడీఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టినా ఆ పార్టీలో అనిశ్చితి కొనసాగుతోంది. పార్టీలోని అగ్రనేతలు శశికళ ఎంపికను ఏకపక్షంగా కానిచ్చేయడంతో ద్వితీయ శ్రేణి మొదలుకుని క్షేత్రస్థాయి వరకు అసంతృప్తితో రగిలిపోతున్నారు. శశికళ బొమ్మతో కూడిన పోస్టర్లు, ఫ్లెక్సీలు కనబడితే చించివేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా శశికళకు పోటీగా దీపను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.


సేలం జిల్లా కేంద్రంగా వెలిసిన జయలలిత దీప పేరవైని అన్నాడీఎంకేలోని అసంతృప్తి వాదు లు వెనకుండి నడిపిస్తున్నారు. దీప పేరవై రాష్ట్రం నలుమూలలా విస్తరి స్తూ సభ్యత్వ నమోదుతో ముందుకు వెళుతోంది. వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసుకుని సభ్యత్వాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు చెన్నైలోని దీప ఇంటి వద్ద అభిమానుల తాకిడి అంతకంతకూ పెరిగిపోతోంది. రాజకీయాల్లోకి రావాలనే ఒత్తిడికి తలొగ్గిన దీప ఈనెల 17వ తేదీన ముహూర్తం పెట్టుకున్నారు. తేదీ మినహా మరే వివరాలను అమె ప్రకటించలేదు.



మాజీ ఎమ్మెల్యే మద్దతు: అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే తిరుచ్చి సౌందరరాజన్ తన మద్దతు ప్రకటించారు. తిరుచ్చిరాపల్లి జిల్లా కైత్తరి కల్యాణమండపంలోబుధవారం తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ,  జయలలిత మరణం తరువాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను దీపతో మాత్రమే భర్తీ చేయగలమని ఆయన అన్నారు. కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం ద్వారా జయలలిత స్థాయిలో దీప మహత్తర శక్తిగా ఎదుగుతారని చెప్పారు.



చెన్నైలో దీప సమాలోచనలు:   ఇదిలా ఉండగా, తన రాజకీయ అరంగేట్రం రోజు సమీపిస్తుండగా చెన్నై నంగనల్లూరులోని కేసీటీ కల్యాణ మండపంలో దీప తన శ్రేయోభిలాషులతో బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో అక్కడక్కడా దీప పేరవై పేరున సమావేశాలు జరుగుతున్నా దీప హాజరుకాలేదు. ఈ దశలో బుధవారం దీప తొలిసారిగా తన అభిమానులతో అందునా చెన్నైలో సమావేశం కావడం ఎంతో కీలకంగా భావించవచ్చు. శశికళ ప్రధాన కార్యదర్శిగా ఉన్నంత వరకు అన్నాడీఎంకేలోకి దీప ప్రవేశించే అవకాశం లేకపోవడంతో కొత్త పార్టీని పెట్టడమా, దీప పేరవైని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడమా అని ఆమె తర్జనభర్జన పడుతున్నారు.


పార్టీనే పెట్టదలుచుకుంటే ఎంజీ రామచంద్రన్, జయలలిత పేర్లు కలిసి వచ్చేలా నామకరణం చేస్తారని సమాచారం. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన అభిమానులతో దీప బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అందరి ఆలోచనల మేరకు దీప ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఆ వివరాలను సమావేశం ముగియగానే మీడియాకు చెబుతారా లేక 17వ తేదీన దీప స్వయంగా ప్రకటిస్తారా అనేది తెలియరావడం లేదు.



అమిత్‌షా ఆరా:  ఇదిలా ఉండగా, దీప రాజకీయరంగ ప్రవేశంపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరా తీస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశానికి తమిళనాడు నుంచి కేబినెట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రి పొన్  రాధాకృష్ణన్, రాష్ట్రశాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్  హాజరయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులతోపాటు ముఖ్యంగా దీపకు పెరుగుతున్న ఆదరణ, రాజకీయాల్లోకి రావడం, దీప వెనుకుండి నడిపించే రాజకీయ శక్తులు ఎవరు తదితర అంశాలపై లోతుగా అడిగి తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు చెప్పాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top