మనసు మార్చుకున్న దీప భర్త మాధవన్‌

మనసు మార్చుకున్న దీప భర్త మాధవన్‌


చెన్నై‌: రాజకీయాల్లో గందరగోళం ఎవరికైనా సహజమే. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. పార్టీ ప్రారంభించినప్పటీ నుంచి అయోమయ పరిస్థితిలో ఉన్నారు  జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌, మాధవన్‌ దంపతులు. అన్నాడీఎంకే నిర్వాహకుల బలవంతంపై జయలలిత అన్న కుమార్తె దీపా ఎంజీఆర్‌ అమ్మ దీపా పేరవై పార్టీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ నిర్వాహకుల ఏర్పాటులో దీపా, మాధవన్‌ల మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాధవన్‌ దీపాతో విడిపోయి ప్రత్యేక పార్టీని ప్రకటించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై మాధవన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. దీపాకు, తనకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తెలిపారు.


తామంటే గిట్టని వాళ్లు ఇలాంటి వదంతులను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. దీపాను ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో పార్టీ ప్రారంభించినట్టు తెలిపారు. పార్టీ పేరు, ఆర్‌కేనగర్‌లో పోటీ చేయడం వంటి విషయాలపై కార్యకర్తలతో చర్చలు జరిపిన  అనంతరం ప్రకటిస్తామని మాధవన్‌ తెలిపారు. నిన్న మాధవన్‌ జయలలిత సమాధి దర్శించుకుని అంజలి ఘటించారు.

Back to Top