జుట్టు పట్టి.... చీర లాగి..

జుట్టు పట్టి.... చీర లాగి..


- బెంగళూరులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వర్గీయుల దాష్టీకం

- బాధితురాలు లగ్గెరె వార్డు కార్పొరేటర్‌
బనశంకరి (బెంగళూరు) : బెంగళూరు రాజకీయాల్లో కాంగ్రెస్‌ నేతలు బరితెగించారు.నిండుసభలో ద్రౌపతి వస్త్రాపహరణ చేసిన విధంగా ఓ మహిళా కార్పొరేటర్‌ను అవమానించారు. రాజరాజేశ్వరినగర ఎమ్మెల్యే మునిరత్న మద్దతుదారులు ఈ దాష్టీకానికి పాల్పడ్డారు.  లగ్గెరె వార్డు బీబీఎంపీ (బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె) కార్పొరేటర్‌, జేడీఎస్‌కు చెందిన మంజులా నారాయణస్వామిపై దాడికి దిగారు. జుట్టు పట్టుకుని, చీర లాగి కీచకుల్లా ప్రవర్తించారు.వివరాల్లోకి వెళ్తే రాజరాజేశ్వరినగర నియోజకవర్గంలోని లగ్గెరె వార్డు పరిధిలో గల రాక్షసహళ్లిలో ముఖ్యమంత్రి నగరోత్థాన పథకం కింద  బృహత్‌ నీటికాలువ పనుల ప్రారంభానికి సీఎం సిద్ధరామయ్య శుక్రవారం విచ్చేశారు. ఈ సమయంలో తన వార్డు పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి తనకు సమాచారం ఇవ్వకపోగా, ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక కూడా అందించలేదని  మంజులా నారాయణస్వామి వాపోయారు. వేదికపై తాను మాట్లాడాలని, అవకాశం కల్పించాలని మేయర్‌ పద్మావతిని కోరారు. కానీ ఆమెకు మాట్లాడే అవకాశం కల్పించలేదు. అలాగే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు మంజులా నారాయణ స్వామిని అడ్డుకుని.. ఆమె జుట్టు, చీర లాగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పారు. అనంతరం బాధితురాలు మాట్లాడుతూ ఒక మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని కన్నీటి పర్యంతమయ్యారు. దాడి విషయం తమ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌డీ.కుమారస్వామి దృష్టికి తీసుకెళతానని తెలిపారు.

Back to Top