సొమ్మొకరిది.. సోకొకరిది..!

సొమ్మొకరిది.. సోకొకరిది..! - Sakshi


కేటీఆర్‌ రిజర్వాయర్ల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్‌ నేతల ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కట్టిన వాటికి మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండలిలో విపక్షనేత షబ్బీర్‌ అలీ, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా నది నుంచి 16.5 టీఎంసీల నీళ్లు హైదరాబాద్‌ కు తీసుకొచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. అలాగే గోదావరి జలాల కోసం యూపీఏ–2 ప్రభుత్వ హయాం లో నిధులు మంజూరు చేయించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు.


గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న దానిని తాము కాదనమని, అయితే గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పనులను కూడా గుర్తించాలని అన్నారు. తామే మొత్తం పూర్తిచేసినట్లుగా కేసీఆర్, కేటీఆర్‌ తలపై నీళ్లు చల్లుకుంటున్నారని, రిజర్వాయర్ల పనులు మంజూరై, 90 శాతం పనులు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.  రిజర్వాయర్లకు కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది చందంగా ఉందని షబ్బీర్‌ అలీ అన్నారు.


కాగా, కేటీఆర్‌ ప్రారంభిస్తున్న రిజర్వాయర్లకు, మిషన్‌ భగీరథకు సంబంధం లేదని సుధీర్‌రెడ్డి అన్నారు. ఈ రిజర్వాయర్లకు తాగునీటి పథకం కింద 1,760 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని సర్వే సత్యనారాయణ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి పేరు రావద్దని పథకాల పేర్లు మారుస్తున్నారని విమర్శించారు. కాగా, గులాబీ కూలీ అనేది లంచం తీసుకోవడంలో కొత్త విధానమని ఆయన ఎద్దేవా చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top