ముంబై ‘హీరో’లు వీరే!


సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై, శివారు ప్రాంత పరిధిలో ఎమ్మెల్యేల పనితీరు, వారి వ్యవహార శైలిపై ‘ప్రజా ఫౌండేషన్’ అనే సేవా సంస్థ అధ్యయనం చేసి ఒక నివేదిక రూపొందించింది. మొత్తం 36 మంది ఎమ్మెల్యేలలో మంచి పనులు, అవినీతికి దూరం, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడిన టాప్ టెన్ ఎమ్మెల్యేలను గుర్తించింది. ఈ టాప్ టెన్‌లో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. కాగా 36 మందిలో ఆరుగురు ఎమ్మెల్యేలపై పెద్ద నేరం కేసులు నమోదుకాగా, 11 మందిపై స్వల్ప నేరాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో నమోదై ఉన్నాయి. ఇందులో శివసేన, ఎమ్మెన్నెస్, బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీలకు చెందినవారు ఉన్నారని ప్రజా ఫౌండేషన్ స్పష్టం చేసింది. మిగతా వారు కేవలం ఎమ్మెల్యే సీటుకు అలంకారంగా ఉండిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడి టాప్ టెన్‌గా నిలిచిన ఎమ్మెల్యేలలో మొదటి స్థానంలో బీజేపీకి చెందిన యోగేష్ సాగర్, రెండో స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన అమిన్ పటేల్ ఉన్నారు.

 

 ఇందులో శివసేనకు చెందిన ఇద్దరు, ఎమ్మెన్నెస్‌కు చెందిన ఒకరు స్థానం సంపాదించుకుని ముంబైలో పార్టీ ప్రభావాన్ని మరింత మెరుగుపర్చుకున్నారు. కాని ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక్కరికి కూడా టాప్ టెన్‌లో స్థానం దక్కకపోవడం గమనార్హం.

 

 టాప్ టెన్‌లో స్థానం.. ప్రధాన కారణాలివే..

 1.    యోగేష్ సాగర్ (బీజేపీ)-మొత్తం 48 అసెంబ్లీ సమావేశాలు జరగ్గా ఇందులో 44 సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాల్లో 357 ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ముంబైకి చెందినవి 71 ఉండగా రాష్ట్రానికి చెందినవి 286 ఉన్నాయి. ప్రజాసేవ చేసినందుకు 20 మార్కుల్లో 14, అవినీతిలో 10 మార్కుల్లో ఏడు వచ్చాయి.  

 

 2.    అమిన్ పటేల్ (కాంగ్రెస్) -41 సార్లు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. 438 ప్రశ్నలు లేవనెత్తగా ఇందులో ముంబైకి చెందినవి 123, రాష్ట్రానికి చెందినవి 315 ఉన్నాయి. ప్రజాసేవ చేసినందుకు 14 మార్కులు, అవినీతిలో 8 మార్కులు వచ్చాయి.

 

 3.    మధుకర్ చవాన్ (కాంగ్రెస్) -47 సార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. 237 ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ముంబైకి చెందినవి 105, రాష్ట్రానికి చెందినవి 132 ఉన్నాయి. ప్రజాసేవకు 14 మార్కులు, అవినీతిలో ఎనిమిది మార్కులు వచ్చాయి.

 

 4.    రమేశ్‌సింగ్ ఠాకూర్ (కాంగ్రెస్) -39 సార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. 174 ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ముంబైకి చెందినవి 60 ఉండగా రాష్ట్రానికి చెందినవి 114 ఉన్నాయి. ప్రజాసేవకు 14 మార్కులు, అవినీతిలో తొమ్మిది మార్కులు వచ్చాయి.

 

 5.    అశోక్ జాదవ్ (కాంగ్రెస్) -47 అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. 203 ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ముంబైకి చెందినవి 70 ఉండగా రాష్ట్రానికి చెందినవి 133 ఉన్నాయి. ప్రజాసేవకు 13 మార్కులు, అవినీతిలో ఎనిమిది మార్కులు వచ్చాయి.

 

 6.    జగన్నాథ్ శెట్టి (కాంగ్రెస్) - 45 సార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. 223 ప్రశ్నలు లేవనెత్తగా ఇందులో 66 ముంబైకి చెందినవి, 157 రాష్ట్రానికి చెందినవి ఉన్నాయి. ప్రజాసేవకు 14, అవినీతిలో ఏడు మార్కులు వచ్చాయి.

 

 7.    సుభాష్ దేశాయి (శివసేన) -47 సార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాగా 571 ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ముంబైకి చెందినవి 100 ఉండగా రాష్ట్రానికి చెందినవి 471 ఉన్నాయి. ప్రజాసేవకు 13, అవినీతిలో ఎనిమిది మార్కులు వచ్చాయి.

 

 8.    రవీంద్ర వాయ్‌కర్ (శివసేన) -మొత్తం 48 అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇందులో 653 ప్రశ్నలు లేవనెత్తగా ముంబైకి చెందినవి 215, రాష్ట్రానికి చెందినవి 438 ఉన్నాయి. ప్రజాసేవకు 13 మార్కులు, అవినీతిలో ఎనిమిది మార్కులు వచ్చాయి.

 

 9.    బాలా నాంద్‌గావ్కర్ (ఎమ్మెన్నెస్) - 41 సార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాగా 1,292 ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ముంబైకి చెందినవి 271 ఉండగా రాష్ట్రానికి చెందినవి 1,021 ఉన్నాయి. ప్రజాసేవకు 15 మార్కులు, అవినీతిలో 8 మార్కులు వచ్చాయి.

 

 10. సర్దార్ తారాసింగ్ (బీజేపీ) - 44 సార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాగా 363 ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో ముంబైకి చెందిన 91 ఉండగా రాష్ట్రానికి చెందినవి 272 ఉన్నాయి. ప్రజాసేవకు 15 మార్కులు, అవినీతిలో ఏడు మార్కులు వచ్చాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top