ఆటోలకు జీపీఎస్‌లు

ఆటోలకు జీపీఎస్‌లు - Sakshi


చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆటోవాలాల దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్టవేస్తోంది. డిజిటల్ టెక్నాలజీతో కూడిన జీపీఎస్ మీటర్లను ఏర్పాటు చేయడం ద్వారా వారిని కట్టడి చేయనుంది. చెన్నైలో ఆటోలను చూసి బెంబేలెత్తని ప్రయాణికుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రయాణికుల ముక్కుపిండి వసూళ్లకు పాల్పడటం ఆటోవాలాలకు ఆనవాయితీగా మారిపోయింది. ప్రజల నుంచి పెద్దపెట్టున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మీటరు చార్జీలను గత ఏడాది అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించి మీటరు పనిచేయడం లేదంటూ ఇంకా కొందరు అత్యధిక వసూళ్లకు పాల్పడుతూనే ఉన్నారు.

 

 దగ్గరలోని ప్రదేశాలకు సైతం నగరమంతా తిప్పడం ద్వారా అత్యధిక చార్జీలను గుంజుతూ దోపిడీకి సిద్ధపడుతున్నారు. పోలీసులు కేసులు పెడుతూనే ఉన్నారు. అరుునా ఫలితం లేకపోవడంతో మీటరు స్థానంలో డిజిటల్ జీపీఎస్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఆటోవారిని పూర్తిగా కట్టడి చేయవచ్చని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. జీపీఎస్‌ల విధానం వల్ల ప్రయాణికుడు వెళ్లాల్సిన గమ్యాన్ని గుర్తించవచ్చు. వెతుక్కునే అవసరం లేకుండానే గమ్యానికి చేర్చవచ్చు. రూ.80 కోట్ల ఖర్చును ప్రభుత్వమే భరించి 2015 మార్చి నాటికి నగరంలోని మొత్తం 70 వేల ఆటోలకు అమర్చేలా ఒక ప్రైవేటు కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. జీపీఎస్ వినియోగంపై ఒక రవాణాశాఖాధికారి మాట్లాడుతూ, ఢిల్లీలో ఇప్పటికే జీపీఎస్ వినియోగాన్ని అమల్లోకి తెచ్చారు,

 

 అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసిన తరువాత ఎల్‌కాట్‌తో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఆటోలకు జీపీఎస్ అమర్చే పనులు మరో ఆరు మాసాల్లో ప్రారంభం కావచ్చన్నారు. ఒక ఆటోకు జీపీఎస్ అమర్చాలంటే అరగంట సమయం పడుతుందని, ఈ లెక్కన నగరంలోని 70 వేల ఆటోలకు పూర్తికావడానికి ఏడాదిన్నర సమయం పట్టవచ్చని ఆయన తెలిపారు. జీపీఎస్ మీటరు తయారీదారులే ఆటోల్లో అమర్చడం, మూడేళ్లపాటూ పర్యవేక్షణ బాధ్యత కూడా వారిదేనని ఆయన చెప్పారు. మూడేళ్ల తరువాత మీటర్ల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వానికి అప్పగిస్తారని అన్నారు. అంతా అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది మార్చినాటికి జీపీఎస్‌లు అందుబాటులోకి వస్తే ఢిల్లీ తరువాత వాటిని వినియోగిస్తున్న నగరంగా చెన్నై రికార్డుల్లోకి ఎక్కుతుందని ఆయన తెలిపారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top