ఆ రెండు పార్టీల వల్లే కష్టాలు


సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీల వల్లనే నగరవాసులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ తన 49 రోజుల ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఏకరవు పెట్టారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ రోడ్లపైకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నగరవాసుల నుంచి భారీ స్వాగతం లభించింది. చాందినీచౌక్ అభ్యర్థిఅశుతోష్‌తో కలిసి ఆయన మంగళవారం రోడ్ షో నిర్వహించారు. మధ్యతరగతి వర్గాల్లో తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు దారి తీసిన కారణాలను వివరించారు. రోడ్‌షోకు కొన్నిచోట్ల భారీ స్పందన లభించగా, పీతంపురావంటి ప్రాంతాల్లో జనం పలుచగా కనిపించారు. ఈ సందర్భం గా పలుచోట్ల కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

 

 65 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనులను తాము చేసి చూపించామని చెప్పారు. తన 49 రోజుల ప్రభుత్వ కాలంలో విద్యుత్, నీటి చార్జీలు తగ్గించానా? లేదా అని ప్రశ్నించారు. ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి నగరవాసులు మళ్లీ రెండింతలు విద్యుత్, నీటి చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. విద్యుత్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కాంగ్రెస్, బీజేపీలు సబ్సిడీని రద్దు చేశాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయి డిస్కంల నుంచి డబ్బు తీసుకున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడాన్ని కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ప్రతిపక్షాలు తను భగోడా (పారిపోయినవాడు) అని విమర్శిస్తున్నాయని, కానీ తాను పారిపోలేదని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు తనను పని చేయనీయలేదని ఆరోపించారు. తాను ఒక్క బిల్లును కూడా ఆమోదించుకోలేకపోయానని, అందుకే రాజీనామా చేశానని చెప్పారు. ‘‘ప్రజలు తన పక్షానే ఉన్నప్పటికీ తల్లి ఆదేశానుసారం రాముడు వనవాసం వెళ్లాడు’’ అని పేర్కొన్నారు. ఆ కాలంలో బీజేపీ ఉంటే రాముడిని కూడా భగోడా అనేవారని ఎత్తిపొడిచారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

 

 చాందినీచౌక్ గల్లీలు.. వీధుల గుండా 20 వాహనాలతో ఓపెన్‌టాప్ జీపులో ప్రయాణిస్తున్న కేజ్రీవాల్‌ను చూడడం కోసం చాందినీచౌక్ వాసులు రోడ్లపై చేరారు. రోడ్డుమీదకు రాలేనివారు ఇంటికప్పుల నుంచి, కిటికీల నుంచి తొంగిచూడడానికి పోటీపడ్డారు. కేజ్రీవాల్ వారికి చేతులూపి ప్రతిస్పందించారు. ఉత్సాహవంతులతో చేతులు కలిపారు. కొంతమంది ఆయన మెడలో పూలదండలు వేశారు. కొందరు ఆయన జీపు వెంట చాలాదూరం నడిచారు. ఆప్ అభ్యర్థి అశుతోష్‌కు ఓటు వేయవలసిందిగా కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఇరుకు వీధులగుండా రోడ్ షో సాగడంతో ట్రాఫిక్‌కు తీవ్రఅంతరాయం కలిగింది. తమ గమ్యస్థానానికి చేరుకునేసరికి గంటలు పట్టాయని పలువురు ఫిర్యాదుచేశారు. రోడ్‌షోను పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తు చేశారు. 

 

 కేజ్రీవాల్ రోడ్ షో మంగళవారం ఉదయం సామ్రాట్ సినిమాహాల్ వద్ద బ్రిటానియా చౌక్ నుంచి మొదలై ‘ఎ’ బ్లాక్ మదర్‌డెయిరీ, సరస్వతీచౌక్ గుండా ఇరుకువీధులు, గల్లీలమీదుగా సాగింది. తాను అధికారంలో ఉండగా విద్యుత్తు, నీటిపై ఇచ్చిన సబ్సీడీ బీజేపీ, కాంగ్రెస్‌ల కారణంగా నిలిచిపోయిందని, మళ్లీ తాము అధికారంలోకి వస్తే సబ్సీడీ అందిస్తామని కేజ్రీవాల్ చెప్పారు.కేజ్రీవాల్ కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ప్రయాణిస్తున్న మహిళా కార్యకర్త ఓ వ్యక్తిని చెంప దెబ్బకొట్టడం కేజ్రీవాల్ రోడ్‌షోలో చర్చనీయాంశంగా మారింది.  తమతో అసభ్యంగా ప్రవర్తించినందువల్ల ఆ వ్యక్తిని చెంపదెబ్బకొట్టినట్లు మహిళా కార్యకర్త చెప్పారు.  అయితే ఆ వ్యక్తి కూడా ఆప్ టోపీ ధరించే రోడ్‌షోలో పాల్గొన్నారు. అతనికి పార్టీతో సంబంధం లేదని ఆప్ కార్యకర్తలు చెప్పారు.  ఆప్ కార్యకర్తలు అతనిని పోలీసులకు అప్పగించారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top