శతాధిక తెలుగు వెలుగులు

శతాధిక తెలుగు వెలుగులు


మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీలో తెలుగు వైభవానికి 130 ఏళ్లు

భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఇక్కడి విద్యార్థే

నేటి నుంచి వార్షికోత్సవాలు

తరలివస్తున్న పూర్వవిద్యార్థులు




సువిశాల భారత దేశంలో తెలుగు ఒక ప్రాంతీయభాష. అయితేనేం ‘దేశభాషలందు తెలుగులెస్స’ అని పేరొంది, ‘సుందర తెలుంగు’ అని తమిళ మహాకవి భారతియార్‌ కీర్తించిన భాష మన తేనెలొలుకు తెలుగు. అంతేగాక ప్రాచీన హోదాను సైతం దక్కించుకుని జాతీయ, అంతర్జాతీయ భాషల ముందు సగర్వంగా నిలబడింది తెలుగు భాష. తెలుగులోని కమ్మదనంలో అంతటి మత్తు, మహత్తు కలిగి ఉన్నందునే మద్రాసు క్రిస్టియన్‌ కాలేజీలోని తెలుగు విభాగం నేటి నుంచి 130 వసంతాల వేడుకలు జరుపుకోగలుగుతోంది.  పరిమితమైన సంఖ్యలోని విద్యార్థుల కోసం 1835లో ఆండ్రీచర్చ్‌కు అనుబంధంగా పాఠశాల స్థాయిలో ఈ చారిత్రాత్మక విద్యాసంస్థ పురుడు పోసుకుంది.



సాక్షి ప్రతినిధి, చెన్నై : మద్రాస్‌ క్రిస్టియన్‌ కళాశాల 1837లో జనరల్‌ అసెంబ్లీ స్కూల్‌గా మారి కేవలం ఒక ప్రధానోపాధ్యాయుడు, 59 మంది విద్యార్థులతో ప్రారంభమై, గవర్నమెంట్‌ ఎయిడెడ్‌ మైనార్టీ విద్యాసంస్థ కోటాలో మద్రాసు యూనివర్సిటీ అఫిలియేటెడ్‌గా ఉద్భవించి డీమ్డ్‌ యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. వందేళ్లపాటు మద్రాసు జార్జిటౌన్‌లో కొనసాగిన ఈ విద్యాసంస్థ 80 ఏళ్ల క్రితం తాంబరంలోని 365 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో శాశ్వత సముదాయానికి చేరుకుంది. 1909–21 మధ్య కాలంలో ఈ విద్యాసంస్థ కీర్తి వేగంగా వ్యాపించడం ప్రారంభించింది. 1937 జనవరి 30వ తేదీన అప్పటి మద్రాసు గవర్నర్‌ లార్డ్‌ జాన్‌ ఎర్స్‌కి విద్యాసంస్థ తొలి క్యాంపస్‌ను ప్రారంభించారు. అప్పటి వరకు విద్యార్థులకే పరిమితం కాగా 1939 నుంచి విద్యార్థినులను సైతం చేర్చుకోవడం ప్రారంభించి 1950లో విద్యార్థినులకు హాస్టల్‌ వసతి సైతం కల్పించారు. 1978లో దేశంలోనే తొలి అటానమి బాడీ విద్యాసంస్థగా గుర్తింపుపొంది 1981లో తొలిబ్యాచ్‌ డిగ్రీ విద్యార్థులను దేశానికి అందించింది.



చారిత్రాత్మక ఈ విద్యాసంస్థ గత 130 ఏళ్లుగా తెలుగు భాషా బోధనను క్రమం తప్పకుండా సాగిస్తూనే ఉంది. ఆంధ్రా భాషాభిరంజిని  సంఘాన్ని 1887లో స్థాపించి పేరుకు తగ్గట్టుగా తెలుగు భాషకు సేవలందిస్తోంది. 1867లో ఐదుగురు విద్యార్థులు బీఏ కోర్సును పూర్తి చేయగా కృష్ణస్వామి పిళ్ళై అనే తెలుగు విద్యార్థి నెల్లూరులో స్థాపించిన శాఖకు హెడ్‌మాస్టర్‌గా నియమితులయ్యారు. అలాగే ఎస్‌.రంగయ్యశెట్టి అనే వ్యక్తి 1871లో మ్యాథమేటిక్స్‌ ట్యూటర్‌గా పనిచేశారు. తెలుగు శాఖాధిపతులుగా దేవ పెరుమాళయ్య (1858 – 1890), డి.సూర్యనారాయణశాస్త్రి (1890–1915), టి.రాజగోపాలరావు (1915–1938), పీఆర్‌పీ ఫ్రాన్సిస్‌ (1938–1968), వెంకటస్వామినాయుడు (1968 – 1996) పనిచేశారు. 1996లో  ఎస్‌.యజ్ఞశేఖర్‌ తెలుగు విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టి కొనసాగుతున్నారు.



ఎందరో విద్యార్థులు.. వారిలో ఎందరో మహానుభావులు

చారిత్రాత్మక ఈ విద్యాసంస్థలో విద్యనభ్యసించిన వారిలో అధిక శాతం అత్యున్నత స్థానాలకు ఎదిగారు. భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఈ విద్యా సంస్థలోనే 1905–1908 మధ్య కాలంలో ఫిలాసఫీలో బీఏ, ఎంఏ పూర్తి చేయడం గర్వకారణం. విద్యార్థిగా ఆయన డాక్టర్‌ మిల్లర్, డాక్టర్‌ కూపర్‌ బంగారు పతకాలను సాధించుకున్నారు. భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత 1962లో చెన్నైకి చేరుకుని కాలేజి అలూమిని అసోసియేషన్‌ ద్వారా సన్మానం అందుకున్నారు. అదే ఏడాది రాష్ట్రపతిగా కూడా మారారు. 1895లో సైన్స్‌ గ్రాడ్యుయేట్‌ కురుమా వెంకటరెడ్డి నాయుడు, 1903లో డిగ్రీ చదువుకున్న బొల్లిని మునుస్వామినాయుడు ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు కొండా వెంకటప్పయ్య (1889), బోగరాజు పట్టాభి సీతారామయ్య (1900)ఈ విద్యా సంస్థ విద్యార్థులే. న్యాపతి సుబ్బారావు పంతులు (1876), కాశినాథుని నాగేశ్వరరావు (1885–87) అనే ప్రముఖ జర్నలిస్టులు, అపోలో గ్రూప్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి (1950) ఇక్కడి విద్యార్థులే. ఈ 130 ఏళ్ల కాలంలో ఎందరో తెలుగు ప్రముఖులు ఈ విద్యాసంస్థల కార్యక్రమాలకు హాజరై  శుభాకాంక్షలు తెలియజేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top