మేము రాజీనామా చేయనందుకే..

Zimbabwe coaching staff sacked as we chose not to resign, Heath Streak - Sakshi

హరారే: వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌కు తమ జట్టు అర్హత సాధించడంలో విఫలమైన తరుణంలో కోచింగ్‌ స్టాఫ్‌పై వేటు వేయడం షాక్‌కు గురిచేసిందని జింబాబ్వే కోచ్‌గా సేవలందించిన హీత్‌ స్ట్రీక్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్ఢ్‌కప్‌ క్వాలిఫై కావడంలో విఫలమైన తర్వాత తమన రాజీనామా చేయాలంటూ జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ఆదేశించిన విషయాన్ని స్ట్రీక్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అయితే తాము స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి సిద్ధం కాకపోవడంతోనే జింబాబ్వే క్రికెట్‌ వేటు వేసిందన్నాడు. ఇది తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని స్ట్రీక్‌ తెలిపాడు.

‘ ఇలా మాపై వేటు వేయడం నిజంగా దారుణం. అది మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. కోచింగ్‌ స్టాఫ్‌ ఫలానా సమయానికి రాజీనామా చేయాలంటూ మా బోర్డు నాకు తెలిపింది. అందుకు మేము విముఖత వ్యక్తం చేశాం. ఆ కారణం చేత మాపై వేటు వేశారు’ అని స్ట్రీక్‌ తెలిపాడు.  ఈ తరహాలో వ్యవహరించడం కచ్చితంగా తమను అవమానపరచడమేనన్నాడు. దీనిలో భాగంగా జట్టుకు నిర్విరామంగా సేవలందించిన స్టాఫ్‌కు స్టీక్‌ కృతజ్ఞతలు తెలియచేశాడు.

ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పేలవ ప్రదర్శనతో వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయిన జింబాబ్వే పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌ గ్రేమ్‌ క్రేమర్‌తో పాటు కోచింగ్‌ స్టాఫ్‌పై వేటు పడింది.  రేమర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి అతని స్థానంలో బ్రెండన్‌ టేలర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. హెడ్‌ కోచ్‌ హీత్‌ స్ట్రీక్, బ్యాటింగ్‌ కోచ్‌ లాన్స్‌ క్లూసెనర్, బౌలింగ్‌ కోచ్‌ డగ్లస్‌ హోండో, ఫీల్డింగ్‌ కోచ్‌ వాల్టర్‌ చవగుట, ఫిట్‌నెస్‌ కోచ్‌ సీన్‌ బెల్, అనలిస్ట్‌ స్టాన్లె చీజాలతో పాటు శిక్షణ బృందాన్ని తొలగిస్తూ జింబాబ్వే క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top