పాక్‌తో మ్యాచ్‌పై స్పందించిన చహల్‌

Yuzvendra Chahal Says If BCCi Says India Will Play Ahainst Pakistan - Sakshi

ముంబై: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో భారత్‌ ఆడకూడదంటూ అన్ని వైపులా డిమాండ్‌ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి కొందరు మాజీ క్రికెటర్లు సైతం మద్దతు పలికారు. అయితే ఈ విషయంపై తాజాగా భారత స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ స్పందించారు. వన్డే ప్రపంచకప్‌లో పాక్‌తో టీమిండియా ఆడాలా వద్దా అనే పూర్తి నిర్ణయం బీసీసీఐకే ఉందని స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచకప్‌లో పాక్‌తో ఆడాలా వద్దా అనేది మా చేతుల్లో లేదు. దీనిపై బీసీసీఐదే తుది నిర్ణయం. మేము దేనికైనా సిద్దమే. నాకు తెలుసు బీసీసీఐకి, ప్రభుత్వానికి ఇది చాలా క్లిష్టమైన సమయం. ఉగ్రదాడిపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిందే. పాక్‌ ప్రజలు అందరూ తప్పు చేశారని అనటం లేదు.. కానీ ఈ దాడులకు పాల్పడిని వారిని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందే’ అంటూ చహల్‌ పేర్కొన్నాడు.

అలా చేస్తే పాక్‌కు లొంగిపోవడమే
పాకిస్తాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ రద్దు చేసుకోవడమంటే యుద్దం చేయకుండానే ఓటమిని ఒప్పుకోవడమే అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. క్రికెట్‌ ఆడకపోవడమంటే పాక్‌కు లొంగిపోవడమే అని ఆయన పేర్కొన్నారు. కార్గిల్‌ యుద్ధం తర్వాత కూడా ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ జరిగిందని గుర్తుచేశారు. ఈ నెల 14న కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరుల కాగా, చాలా మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఉగ్రవాదులకు రక్షిణ కల్పిస్తున్న పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top