ధోనీపై యువరాజ్‌ తండ్రి సంచలన ఆరోపణ

ధోనీపై యువరాజ్‌ తండ్రి సంచలన ఆరోపణ


న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్‌ ధోనీ, యువరాజ్‌ సింగ్‌ మంచి స్నేహితులు అయ్యారని కథనాలు వెలువడుతుండగా ఎంఎస్‌ ధోనీపై యువరాజ్‌ తండ్రి యోగరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కెప్టెన్‌ ధోనీ కాదు కాబట్టే తన కుమారుడు యువరాజ్‌ సింగ్‌ మళ్లీ టీమిండియా వన్డే జట్టులోకి వచ్చాడని అన్నారు. బుధవారం సాయంత్రం మహారాష్ట్ర టైమ్స్‌తో మాట్లాడిన ఆయన ఇలాంటిది రెండేళ్ల కిందటే జరగాల్సిందని, కానీ తాజాగా జరిగిందని చెప్పారు.


చదవండి..(ధోనీ, యువరాజ్ ఫ్రెండ్స్ అయ్యారా..!)
తనను టీంకు ఎంపిక చేసినా చేయకపోయినా యువరాజ్‌ సింగ్‌ మాత్రం ఎప్పుడూ తన అసంతృప్తిని ధోనీపై వెళ్లగక్కలేదు. పరోక్షంగా చేసినా అది అంటిముట్టనట్లుగా అరుదుగా ఏదో ఒక కామెంట్‌ చేసేవాడు. అది కాకుండా ధోనీ నాయకత్వాన్ని ఎక్కువసార్లు యువరాజ్‌ పొగిడిన సందర్భాలే ఎక్కువ. కానీ, యువరాజ్‌ తండ్రి యోగరాజ్‌ మాత్రం ధోనీ విషయంలో కాస్తంత దూకుడుగానే విమర్శలు చేసేవారు.టీమిండియా జట్టు ఎంపిక సమయంలో తన కుమారుడు యువరాజ్‌ పట్ల ధోనీ ప్రవర్తన సరిగా ఉండదని యోగరాజ్‌ ఆరోపించేవారు. ఏదో ఒక కామెంట్‌తో వార్తల్లో నిలిచేవారు. తాజాగా నేరుగా ధోనీపై ఇలాంటి ఆరోపణ చేసి ఆయన మరోసారి అందరిని అవాక్కయ్యేలా చేశారు. గతవారమే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్‌ బాధ్యతలు వహిస్తున్న కోహ్లీనే ఇక నుంచి మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహించనున్నాడు.  

Back to Top