‘కమాన్‌ ఇంగ్లండ్‌.. మీ వెంట మేమున్నాం’

World Cup 2019 Final Come on England Former Cricketers Wish Their Team - Sakshi

లండన్‌: సెమీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ సగర్వంగా అడుగుపెట్టింది. క్రికెట్‌ విశ్వసమరంలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌ ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందేనని కృతనిశ్చయంతో ఉంది. ఇక 27 ఏళ్ల తర్వాత తమ జట్టు ఫైనల్‌కు చేరడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సంతోషం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా ఫైనల్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతూ వినూత్నంగా ఓ వీడియోను క్రియేట్‌ చేసి తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూపరులను తెగ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ తరుపున ప్రాతినిథ్యం వహించిన 101 మంది ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియాలో ఇయాన్‌ బోథమ్‌, గ్రాహమ్‌ గూచ్‌, ఆండ్రూ స్ట్రాస్‌, నాసిర్‌ హుస్సెన్‌ వంటి ఇంగ్లండ్‌ దిగ్గజాలు ‘కమాన్‌ ఇంగ్లండ్‌’ అంటూ ప్రపంచకప్‌లో తమ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు. 

‘101 మంది ఇంగ్లండ్‌ క్రికెటర్లు మీకంటే ముందు ప్రపంచకప్‌ గెలవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు చరిత్రను సృష్టించే అవకాశం మీకు వచ్చింది. దేశం కోసం ప్రపంచకప్‌ గెలిచి గర్వించేలా చేయండి’అంటూ ఇయాన్‌ బోథమ్‌ పేర్కొన్నాడు. ‘కేవలం ఒక్క ఇంగ్లండ్‌ జట్టు మాత్రమే మూడు సార్లూ ఫైనల్‌కు చేరి ప్రపంచకప్‌ గెలవకుండా ఉంది. ఓడిపోయిన బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయితే ఇప్పటివరకు మోర్గాన్‌ సేన అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. ఫైనల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా పోరాడండి. ఆదివారం మ్యాచ్‌కు ఆల్‌ ద బెస్ట్‌’అంటూ గ్రాహమ్‌ గూచ్‌ వ్యాఖ్యానించాడు. ‘పేరుకే క్రికెట్‌ పుట్టినిల్లు.. కానీ ఒక్కసారి కూడా వన్డే ప్రపంచకప్‌ గెలవలేదు.. ఈ సారి గెలిచి తలెత్తుకునేలా చేయండి’అంటూ ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top