నిరీక్షణ ఫలించేనా?

World Badminton Championship from today - Sakshi

నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌  

పురుషుల సింగిల్స్‌లో 36 ఏళ్లుగా అందని పతకం

బరిలో శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్‌ వర్మ

మహిళల సింగిల్స్‌ పసిడి వేటలో సింధు, సైనా

డబుల్స్‌లో ఆశలు అంతంతే

గత ఐదు ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లలో మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు కనీసం కాంస్యం లేదంటే రజతం వచ్చింది. గత రెండు పర్యాయాల్లోనైతే త్రుటిలో స్వర్ణ పతకాలు చేజారాయి. అందని ద్రాక్షగా ఉన్న పసిడి పతకాన్ని ఈసారైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ బరిలోకి దిగుతుండగా... పురుషుల సింగిల్స్‌ విభాగంలో 36 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, సమీర్‌ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ ఏడాది మహిళల సింగిల్స్‌తోపాటు పురుషుల సింగిల్స్‌లోనూ భారత స్టార్స్‌ ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడంతో తుది ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.    

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): ఈ సీజన్‌లో నిరాశాజనక ఫలితాలు లభించినా... వాటన్నింటినీ మర్చిపోయేలా... తాజా ప్రదర్శనను అభిమానులందరూ గుర్తుపెట్టుకునేలా... తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేయాలనే పట్టుదలతో... నేటి నుంచి మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. తొలి రోజు పురుషుల సింగిల్స్‌లో భారత టాప్‌–4 క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, ప్రణయ్, సమీర్‌ వర్మ పోటీపడనున్నారు. ప్రపంచ 81వ ర్యాంకర్‌ ఎన్‌హట్‌ ఎన్గుయెన్‌ (ఐర్లాండ్‌)తో పదో ర్యాంకర్‌ శ్రీకాంత్‌... 34వ ర్యాంకర్‌ లోకీన్‌ యెవ్‌ (సింగపూర్‌)తో 14వ ర్యాంకర్‌ సమీర్‌ వర్మ... 66వ ర్యాంకర్‌ జేసన్‌ ఆంథోని హో షుయె (కెనడా)తో 19వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌; 93వ ర్యాంర్‌ ఈటు హీనో (ఫిన్‌లాండ్‌)తో 30వ ర్యాంకర్‌ ప్రణయ్‌ తలపడనున్నారు. అత్యున్నతస్థాయి టోర్నీ కావడంతో ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా భారత ఆటగాళ్లందరూ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. లేదంటే తొలి రౌండ్‌లోనే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదముంది.

పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్, సాయిప్రణీత్‌లకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌ అడ్డంకిని అధిగమిస్తే రెండో రౌండ్‌లో చైనా దిగ్గజం లిన్‌ డాన్‌తో ప్రణయ్‌... లీ డాంగ్‌ కెయున్‌ (కొరియా)తో సాయిప్రణీత్‌ ఆడే అవకాశముంది. రెండో రౌండ్‌ను కూడా దాటితే మూడో రౌండ్‌లో ప్రణయ్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ కెంటో మొమోటా (జపాన్‌); సాయిప్రణీత్‌కు ఆరో సీడ్‌ ఆంథోనీ జిన్‌టింగ్‌ (ఇండోనేసియా) ఎదురుకావొచ్చు. మరోవైపు శ్రీకాంత్‌కు క్వార్టర్‌ ఫైనల్‌ వరకు కఠిన ప్రత్యర్థి దారిలో లేడు. క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌కు రెండో సీడ్‌ చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) ఎదురయ్యే చాన్స్‌ ఉంది. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ గెలిస్తే పతకం ఖాయమవుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం. 1983లో ప్రకాశ్‌ పదుకొనే సెమీస్‌లో ఓడి కాంస్య పతకాన్ని సాధించాడు. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌లో ఇప్పటివరకు భారత్‌ నుంచి ఎవ్వరూ సెమీఫైనల్‌ చేరుకోలేదు. 2018లో సాయిప్రణీత్‌... 2017లో శ్రీకాంత్‌... 2013లో పారుపల్లి కశ్యప్‌... 2007లో అనూప్‌ శ్రీధర్‌.. 2001లో పుల్లెల గోపీచంద్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయి త్రుటిలో పతకాలకు దూరమయ్యారు.  

ఒకే పార్శ్వంలో సింధు, సైనా 
మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్‌  సింధు, ఎనిమిదో సీడ్‌ సైనా ఒకే పార్శ్శంలో ఉండటంతో వీరిద్దరు సెమీఫైనల్లో ఎదురయ్యే అవకాశముంది. తొలి రౌండ్‌లో వీరిద్దరికీ ‘బై’ లభించడంతో నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడతారు. రెండో రౌండ్‌లో సబ్రీనా (స్విట్జర్లాండ్‌)తో సైనా... పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ)తో సింధు ఆడే చాన్స్‌ ఉంది. క్వార్టర్‌ ఫైనల్లో సైనాకు నాలుగో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా)... సింధుకు రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) ప్రత్యర్థులుగా ఉండే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి టాప్‌ సీడ్‌ అకానె యామగుచి (జపాన్‌), మాజీ విశ్వవిజేత ఒకుహారా (జపాన్‌) సెమీస్‌ చేరుకోవచ్చు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌లో లేని ప్రాతినిధ్యం... 
డబుల్స్‌ విషయానికొస్తే భారత్‌కు ఈసారీ పతకావకాశాలు లేవనే చెప్పవచ్చు. ఇటీవల థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో పురుషుల డబుల్స్‌ టైటిల్‌ గెలిచిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట చివరి నిమిషంలో ఈ మెగా ఈవెంట్‌ నుంచి వైదొలిగింది. సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి... శ్లోక్‌ రామచంద్రన్‌–అర్జున్‌ జోడీలు బరిలో ఉన్నా... రెండో రౌండ్‌లోనే వీరికి చైనా జంటలు ఎదురుకానున్నాయి. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; మేఘన–పూర్వీషా; సంజన–పూజ జోడీలు రెండో రౌండ్‌ దాటిముందుకెళ్లడం కష్టమే. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఈసారి భారత ప్రాతినిధ్యం లేదు. వాస్తవానికి అశ్విని–సాత్విక్‌; సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీలకు ఎంట్రీ లభించినా... సాత్విక్, ప్రణవ్‌లకు గాయాలు కావడంతో ఈ రెండు జోడీలు వైదొలిగాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top