టైటిల్‌ పోరుకు భారత్‌

టైటిల్‌ పోరుకు భారత్‌


చివరి లీగ్‌ మ్యాచ్‌లో జింబాబ్వేపై 10 వికెట్లతో గెలుపు 

రాణించిన పూనమ్, దీప్తి, వేద  
పోట్చెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): ప్రపంచ కప్‌కు సన్నాహకంగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న నాలుగు దేశాల మహిళల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత జట్టు టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వేతో శుక్రవారం జరిగిన చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. తొలుత బౌలర్లు, ఆ తర్వాత ఓపెనర్లు రాణించడంతో భారత్‌ ఖాతాలో ఐదో విజయం చేరింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే 42.3 ఓవర్లలో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ (4/11), దీప్తి శర్మ (4/17) నాలుగేసి వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బతీశారు.99 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 16 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా అధిగమించింది. ఓపెనర్లు వేద కృష్ణమూర్తి (51 బంతుల్లో 50 నాటౌట్‌; 9 ఫోర్లు), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (46 బంతుల్లో 39 నాటౌట్‌; 6 ఫోర్లు, ఒక సిక్స్‌) అజేయంగా నిలిచారు. దీప్తి శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది. నాలుగు జట్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్‌ దశ ముగిశాక భారత్, దక్షిణాఫ్రికా జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం ఫైనల్‌ జరుగుతుంది. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో జింబాబ్వేతో ఐర్లాండ్‌ తలపడుతుంది. 

Back to Top