అది ఔట్‌ ఎలా ఇస్తారు:? కేన్‌ అసంతృప్తి

Williamson disappoints Third Umpire Decision - Sakshi

ఆక్లాండ్‌: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌ ఆటగాడు డార్లీ మిచెల్‌ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. భారత బౌలర్‌ కృనాల్‌ పాండ్యా వేసిన ఆరో ఓవర్‌ ఆఖరి బంతికి మిచెల్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేరడం కాస్త కివీస్‌ శిబిరంలో ఆందోళన వ్యక్తమైంది. కృనాల్‌ వేసిన బంతి నేరుగా డార్లీ లెగ్‌ను ముద్దాడింది. దీనిపై భారత ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా దానికి ఫీల్డ్‌ అంపైర్‌ సానుకూలంగా స్పందించి ఔట్‌గా ప్రకటించాడు. దీన్ని సవాల్‌ చేశాడు డార్లీ మిచెల్‌. అది ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయ్యిందంటూ డీఆర్‌ఎస్‌ కోరాడు. అవతలివైపు క్రీజ్‌లో ఉన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా మిచెల్‌కు మద్దతుగా నిలిచాడు.

అయితే థర్డ్‌ అంపైర్‌ పలు కోణాల్లో పరిశీలించిన తర్వాత ఔట్‌గా ఇచ్చాడు. దాంతో మిచెల్‌తో పాటు విలియమ్సన్‌లు ఒక‍్కసారిగా షాక్‌కు గురయ్యారు. అది ఔట్‌ ఎలా ఇస్తారు? అంటూ ఫీల్డ్‌ అంపైర్‌ను ప్రశ్నించడంతో కాసేపు అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది కచ్చితంగా ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయ్యిందంటూ వాదించిన మిచెల్‌ క్రీజ్‌ను వీడేందుకు ఇష్టపడలేదు.

దాంతో ఫీల్డ్‌ అంపైర్లు చర్చించుకున్న తర్వాత థర్డ్‌ అంపైర్‌ను మరొకసారి బ్యాట్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌పై స్పష్టత కోరారు. కాగా, థర్డ్‌ అంపైర్‌ మాత్రం తొలుత తీసుకున్న నిర‍్ణయానికి కట్టుబడి ఎటువంటి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ కాలేదంటూ వివరణ ఇచ్చాడు. అయితే హాట్‌స్పాట్‌లో మాత్రం బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయినట్లు కనబడినప్పటికీ థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడంతో వివాదాస్పదమైంది. చివరకు చేసేది లేక డార్లీ మిచెల్‌ భారంగా పెవిలియన్‌ చేరాడు. దాంతో 43 పరుగుల వద్ద కివీస్‌ మూడో వికెట్‌ను నష్టపోయింది. ఆపై కాసేపటికి కేన్‌ విలియమ్సన్‌(20) కూడా ఔటయ్యాడు. కృనాల్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ ఐదో బంతికి విలియమ్సన్‌ ఎల్బీగా పెవిలియన్‌ బాట పట్టడం గమనార్హం. అంతకుముందు టీమ్‌ సీఫెర్ట్‌(12) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, రెండో వికెట్‌గా కొలిన్‌ మున్రో(12) ఔటయ్యాడు.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top