అత్యున్నతంగా నిలపడమే లక్ష్యం

Will continue to experiment as we look to build a legacy - Sakshi

టీమిండియా మున్ముందు అద్భుతాలు చేస్తుంది

హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యలు

కూలిడ్జ్‌ (అంటిగ్వా): భారత పురుషుల జాతీయ జట్టు హెడ్‌ కోచ్‌గా నియామకం అనంతరం రవిశాస్త్రి తన భవిష్యత్‌ ప్రణాళికను వివరించాడు. కొత్త తరం వస్తున్నందున తాను వైదొలిగే లోపు జట్టు పునర్‌ నిర్మాణ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడటం ప్రధానమైనదని పేర్కొన్నాడు. మరో నలుగురైదుగురు బౌలర్లను వెదికి పట్టుకోవడం ఇందులోని సవాల్‌గా అతడు తెలిపాడు. ‘26 నెలల నా పదవీ కాలం పూర్తయ్యేసరికి టీమిండియాను అత్యున్నత స్థానంలో నిలపపడమే లక్ష్యం. తద్వార రాబోయే తరానికి వారు ఘన వారసత్వం అందిస్తారు. ఈ జట్టు మున్ముందు అద్భుతాలు సృష్టించగలదన్న నమ్మకం నాకుంది.

మేం ఇప్పుడు ఆ దిశగానే వెళ్తున్నాం. పురోగమనానికి అంతుండదు. యువ ఆటగాళ్లను చూస్తుంటే ఉత్సాహంగా ఉంది. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు శ్రద్ధ కూడా అదేవిధంగా ఉండాలి. ఫలితాలు రాకపోయినా నిరుత్సాహం చెందొద్దు. గత రెండు–మూడేళ్లుగా టీమిండియా స్థిరంగా విజయాలు సాధిస్తోంది. ఇకపై వాటిని మరింత పెంచుకుంటూ పోవాలి’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కొన్నేళ్లుగా జట్టు పురోగతిని విశ్లేషించిన అతడు ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫీల్డింగ్‌లో సాధించిన ప్రగతిని నొక్కిచెప్పాడు. ఈ ప్రమాణాలను మరో మెట్టు ఎక్కించడమే తమ బృందం లక్ష్యమని వివరించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top