అందుకే సెహ్వాగ్ ను కాదన్నారా!

అందుకే సెహ్వాగ్ ను కాదన్నారా!


న్యూఢిల్లీ: ఇంట గెలిచాకే.. రచ్చ గెలవాలి కదా.. ఈ విషయం మన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు తెలిసినట్లు లేదు. టీమిండియా కోచ్ గా దరఖాస్తు చేసినప్పుడు సెహ్వాగ్ కు ఆ పదవి దాదాపు ఖాయమైనట్లే కనబడింది. అయితే చివరికొచ్చేసరికి కోచ్ రేసులో అనూహ్యంగా వెనుబడిపోయాడు సెహ్వాగ్.



ప్రధాన కోచ్ గా ఏమి చేయాలనుకుంటున్నాడనే దానిపై ప్రజెంటేషన్ ఇచ్చిన తీరు సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ)కి బాగా నచ్చింది. అదే సమయంలో కోహ్లి కూడా సెహ్వాగ్ నియామకంపై పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఒకవేళ సీఏసీ సెహ్వాగ్ ను నియమిస్తే అందుకు ఓకే అనే సంకేతాలు కూడా ఇచ్చాడు. అయితే సెహ్వాగ్ చేసిన ఒక ప్రతిపాదన అతని పదవికి ఎసరు తెచ్చినట్లు తెలుస్తోంది. టీమిండియా కోచ్ అంశంలో తన పదవి ఖాయం కాకముందే సహాయక సిబ్బంది విషయంలో పట్టుపట్టి అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నడనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.



ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్ కు కోచ్ గా సేవలందించిన సెహ్వాగ్.. ఆ జట్టుకు సహాయక సిబ్బందిగా పనిచేసిన ఫిజియో అమిత్ త్యాగి, అసిస్టెంట్ కోచ్ మిథున్ మన్షాస్ లను తెచ్చుకుంటానని అడిగినట్లు సమాచారం. ఈ విషయంలో సీఏసీ ఆలోచనలో పడటంతో సెహ్వాగ్ ఒక్కసారిగా వెనుకబడిపోయాడు. అదే సమయంలో కోహ్లి సూచించిన రవిశాస్త్రి ముందువరుసలోకి వచ్చేశాడు. ఇక్కడ రవిశాస్త్రి జట్టుకు సంబంధించి మాత్రమే ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ సమయంలో సహాయక సిబ్బంది విషయంలో రవిశాస్త్రి నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదు. దాంతోనే జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్ ల పేర్లను  సీఏసీ తెరపైకి తీసుకొచ్చింది. అయితే, రవిశాస్త్రి కోచ్ గా నియమించబడిన తరువాత తన సహాయక సిబ్బంది విషయంలో యాక్టివ్ గా ఉన్నాడు. జహీర్ ఖాన్ వద్దంటూ పట్టుబట్టుకుని కూర్చొన్నాడు. అతని స్థానంలో భరత్ అరుణ్ ను నియమించాల్సిందేనంటూ సీఏసీని ఛాలెంజ్ చేశాడు. మరి, ముందుకు సహాయక సిబ్బందిని అడిగి సెహ్వాగ్ పొరపాటు చేశాడా? అనేది మాత్రం అతనికే తెలియాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top