ధోని ‘కృతజ్ఞత’ 

Why MS Dhoni Has Been Changing Bat Logos in the World Cup - Sakshi

లండన్‌: ప్రపంచ కప్‌లో ధోని బ్యాటింగ్‌ శైలిపై ఎడతెగని చర్చ నడుస్తోంది. అతను ఈ మెగా టోర్నీ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే  కప్‌లో ధోని బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతని బ్యాట్‌లను చూస్తే ఒక ఆసక్తికర అంశం బయటకొచ్చింది. అదేమంటే.. మాజీ కెప్టెన్‌ ఒకే కంపెనీకి చెందిన స్టికర్‌ ఉన్న బ్యాట్‌లు కాకుండా వేర్వేరు లోగోలతో ఉన్న బ్యాట్‌లు వాడుతున్నాడు. ఎస్‌ఎస్, ఎస్‌జీ, బాస్‌ (వాంపైర్‌) స్టికర్‌లు మనకు కనిపిస్తున్నాయి. సాధారణంగా అగ్రశ్రేణి క్రికెటర్లకు బ్యాట్‌ స్పాన్సర్‌షిప్‌ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకు ఏడాదికి వారికి రూ. 4–5 కోట్లు అందుతాయి. ప్రస్తుతం కోహ్లికి ఎంఆర్‌ఎఫ్‌ సుమారు. 9 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ధోని ఇటీవలి వరకు స్పార్టన్‌ స్టికర్‌ బ్యాట్‌ వాడాడు. అయితే ఆ కంపెనీ దివాళా తీయడంతో తన బ్యాట్‌పై ఆ లోగోను తప్పించాడు.

ఇప్పుడు ధోని వేర్వేరు కంపెనీల బ్యాట్‌లు ప్రదర్శించడానికి కారణం వారితో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి, ఆయా కంపెనీలకు కృతజ్ఞత తెలిపేందుకు అట! వీరెవరితో ప్రస్తుతం ధోనికి కాంట్రాక్ట్‌ లేదు. ఈ విషయాన్ని అతని ఆత్మీయ స్నేహితుడు, మేనేజర్‌ అరుణ్‌ పాండే వెల్లడించాడు. ‘ధోని చాలా పెద్ద మనసు కలవాడు. తన కెరీర్‌ ఆరంభంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత వేర్వేరు సందర్భాల్లో కిట్‌లు అందించి అండగా నిలిచిన కంపెనీలకు అతను ఈ రకంగా ప్రచారం చేస్తున్నాడు. ఇందుకు అతను ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. ధోనికి ఇప్పుడు డబ్బులు అవసరం లేదు. కాబట్టి తనదైన రీతిలో కృతజ్ఞత చూపిస్తున్నాడు. వాంపైర్‌ కంపెనీ గురించైతే ధోని సినిమాలో కూడా ప్రస్తావించాం’ అని పాండే వివరించాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top