పంత్‌.. నువ్వు మారవా!

When will Rishabh learn Twitter bemused - Sakshi

లాడర్‌హిల్‌(అమెరికా): ‘ ఎంఎస్‌ ధోని లేని అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. నీలో సత్తా ఉందని తెలుసు. దాన్ని మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఇప్పుడు నీ ముందుంది. నిన్ను నువ్వు నిరూపించుకో’ అని వెస్టిండీస్‌తో తొలి టీ20కి ముందు ప్రత్యేకంగా రిషబ్‌ పంత్‌ గురించి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పిన మాట ఇది. అయితే శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో పంత్‌ గోల్డెన్‌ డక్‌గా నిష్క్రమించాడు. ఆడిన తొలి బంతికే భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. వరల్డ్‌కప్‌లో పలు సందర్భాల్లో నిర్లక్ష్యపు షాట్లకు పోయి వికెట్‌ను సమర్పించుకున్నాడు పంత్‌. అందులోను న్యూజలాండ్‌తో జరిగిన సెమీస్‌లో పంత్‌ భారీ షాట్‌ ఆడి వికెట్‌ను చేజార్చుకోవడంతో అప్పట్లో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా విండీస్‌తో జరిగిన టీ20లో కూడా పంత్‌ అనవసరపు షాట్‌కు పోయి వికెట్‌ పాడేసుకున్నాడు. తొలి బంతికే వికెట్‌ కోల్పోయి డకౌట్‌ అయ్యాడు. పదే పదే డీప్‌ స్వేర్‌ లెగ్‌లోనే పంత్‌ షాట్లు ఆడి వికెట్‌ కోల్పోవడం టీమిండియా కోచింగ్‌ విభాగానికి ప్రధాన సమస్యగా మారిపోయింది. ధోని లేని లోటును పూడ్చుతాడని భావిస్తే.. అంత నిర్లక్ష్యంగా ఆడటం జట్టు మేనేజ్‌మెంట్‌ను కలవర పరుస్తోంది. ఇక అభిమానుల నోటికి పని చెప్పేలా చేస్తోంది.

విండీస్‌తో మ్యాచ్‌లో వికెట్‌ను  ఫన్నీగా కోల్పోవడాన్ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ‘ పంత్‌.. ఇక నువ్వు మారవా’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు పంత్‌ ఎప్పుడు నేర్చుకుంటాడో చెప్పాలని నిలదీస్తున్నారు. పంత్‌ ఇంత నిర్లక్ష్యంగా ఆడుతుంటే కోచింగ్‌ విభాగం ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.  96 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఇలానే ఆడటం అంటూ ఏకిపారేస్తున్నారు. ఎంతో కాలంగా భారత్‌ క్రికెట్‌ జట్టుకు ప్రశ్నగా మిగిలి పోయిన  నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఈ తరహా ఆట ఏమిటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పంత్‌.. నువ్వు ఇలా ఆడటం కారణంగానే ధోని ఇంకా రిటైర్మెంట్‌ ప్రకటించలేదు’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్‌ తనకు వచ్చిన అవకాశాల్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడని, దాంతో అతనికి స్వస్తి పలికి మరో వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top