కోహ్లి కెప్టెన్సీపై ఆర్సీబీ డైలామా!

Is Virat Kohli the Right Man to Lead Royal Challengers Bangalore - Sakshi

బెంగళూరు : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లి కెప్టెన్సీపై జట్టు యాజమాన్యం పునరాలోచనలో పడిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఐపీఎల్‌ లీగ్‌లోనే అత్యంత ఆదరణ కలిగిన ఆర్సీబీకి .. టైటిల్‌ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.  అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు గత 12 సీజన్లలో మూడు సార్లు ఫైనల్‌కు చేరి టైటిల్‌ను అందుకోలేకపోయింది. ఇందులో రెండు సార్లు హైదరాబాద్‌ జట్టుతోనే ఓడిపోవడం గమనార్హం. 2011లోనే సారథ్య బాధ్యతలు చేపట్టిన కోహ్లి.. పూర్తి స్థాయి పగ్గాలు మాత్రం 2012 సీజన్‌లో అందుకున్నారు. 2016 సీజన్‌లో చెలరేగిన కోహ్లి.. ఒంటి చేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఆ సీజన్‌ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన ఆర్సీబీ ఫైనల్లో ఓడి తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. అనంతరం 2017, 2018 సీజన్లలో దారుణంగా వైఫల్యం చెంది పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక తాజా సీజన్‌లోనైనా టైటిల్‌ కల నెరవేరుతుందా? అని ఆర్సీబీ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూశారు. కానీ ఆ జట్టు ప్రదర్శన ఏ మాత్రం మారలేదు. అదే తడబాటు.. అవే తప్పులు.. అవే ఫలితాలు. ఎలాంటి మార్పులేదు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయం చవిచూసింది.

తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడినా.. కొంత పోరాట పటిమను పదర్శించింది. రెండో మ్యాచ్‌లో ముంబై చేతిలో అంపైర్‌ తప్పిదంతో ఓడింది. ఇక మూడో మ్యాచ్‌లో అయితే హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ దాటికి కొట్టుకుపోయింది. తాజాగా మంగళవారం జరగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ చేతిలో 7 వికెట్ల తేడాతో చిత్తైయింది. పైగా ఈ మ్యాచ్‌ విరాట్‌ కోహ్లికి కెప్టెన్‌గా 100వ మ్యాచ్‌. ఓ మైలురాయిగా నిలిచే ఈ మ్యాచ్‌లో గెలువాలని భావించిన కోహ్లికి పరాజయమే మిగిలింది. ఈ నేపథ్యంలోనే కోహ్లి కెప్టెన్సీ లుకలుకలపై చర్చ మొదలైందని, ఆర్సీబీ యాజమాన్యం పునరాలోచనలో పడిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక ఐపీఎల్‌ టాప్‌ కెప్టెన్‌ల గణంకాలు పరిశీలించగా.. కోహ్లి రికార్డు దారుణంగా ఉంది. 100 మ్యాచ్‌లకు కోహ్లి కెప్టెన్సీ చేయగా.. ఆర్సీబీ 46.39 శాతం విజయాలనే నమోదు చేసింది. ఇది ధోని, రోహిత్‌ శర్మ, గౌతం గంభీర్‌, డెవిడ్‌ వార్నర్‌, దినేశ్‌ కార్తీక్‌ల విన్నింగ్‌ పర్సంటేజ్‌ల కన్నా చాలా తక్కువ.

 

ఈ సీజన్‌లో జట్టు సమతూకంలో కూడా కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ఓపెనర్లుగా ఎవరిని పంపించాలనే విషయంలో ఓ స్పష్టతకు రాలేదు. పొట్టి ఫార్మాట్‌లో ఓపెనర్ల ఆరంభమే చాలా కీలకం. అలాంటి స్థానంలో మ్యూజికల్‌ చైర్స్‌ ఆటలా బ్యాట్స్‌మన్‌ స్థానాలను ప్రతి మ్యాచ్‌కు మార్చుతూ దారుణంగా విఫలమవుతున్నారు. ఓ ప్రణాళిక లేకుండా బరిలోకి దిగి దారుణ ఓటములను మూటగట్టుకుంటున్నారు. ఇక నిన్నటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి ఓవర్‌ నుంచే స్పిన్‌ అటాకింగ్‌ చేసి ఆర్సీబీని కట్టడి చేయగా... కోహ్లి మాత్రం ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ వరకు స్పిన్నర్లకు అవకాశం ఇవ్వకపోవడం.. అతని కెప్టెన్సీ సామర్థ్యంపై అనుమానం కలిగించేలా చేసింది. కోహ్లికి జట్టు ఆటగాళ్లపై స్పష్టత లేదని, ఏ ఆటగాళ్లను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో తెలియడం లేదని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆర్సీబీ అభిమానులైతే ఆ జట్టు ప్రదర్శనను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీకి కెప్టెన్‌గా కోహ్లి అవసరమా? అనే సందిగ్దంలో ఆర్సీబీ యాజమాన్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top