విరాట్‌ కోహ్లి మరో ఘనత

Virat Kohli Most wins in overseas Tests as captain for India - Sakshi

మెల్‌బోర్న్‌: భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప‍్పటివరకూ విదేశాల్లో 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 11 విజయాలు సాధించాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా గెలుపు తర్వాత  గంగూలీతో కలిసి టాప్‌ను ఆక్రమించాడు. కాగా, గంగూలీ విదేశాల్లో 28 టెస్టుల్లో సారథ్యం వహించి 11 విజయాలు సాధించగా, కోహ్లి 24 టెస్టుల్లోనే ఆ గెలుపు మార్కును చేరుకోవడం విశేషం. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో గంగూలీ, కోహ్లిల తర్వాత స్థానాల్ల ఎంఎస్‌ ధోని(6), రాహుల్‌ ద్రవిడ్‌(5)లు ఉన్నారు. 

ఆసీస్‌తో మూడో టెస్టులో భారత్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరిరోజు ఆటలో ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ భారీ విజయం సాధించింది. 258/8  ఓవర్‌నైట్‌ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్‌ మరో మూడు పరుగులు చేసి మిగతా రెండు వికెట్లను కోల్పోవడంతో భారత్‌ బాక్సింగ్‌ డే టెస్టు విజయాన్ని తొలిసారి సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. కాగా, విదేశీ టెస్టుల్లో(ఆసియా ఖండం వెలుపల)ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాల్ని భారత్‌ నమోదు చేసింది. ఈ ఏడాది నాలుగు విదేశీ టెస్టు విజయాల్ని భారత్‌ సాధించింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జోహనెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ను గెలిచిన భారత్‌.. ఇంగ్లండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆపై ఆసీస్‌తో ప్రస్తుత సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ టెస్టులు భారత్‌ ఖాతాలో చేరాయి. తద్వారా 1968లో న్యూజిలాండ్‌పై వారి దేశంలో గెలిచిన టెస్టు మ్యాచ్‌ల రికార్డును భారత్‌ తాజాగా సవరించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top