వన్డేల్లో కోహ్లి.. టెస్టుల్లో స్మిత్‌..

వన్డేల్లో కోహ్లి.. టెస్టుల్లో స్మిత్‌..

సాక్షి,చెన్నై: వన్డేల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌లు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్‌ 17న ఆసీస్‌తో ప్రారంభమయ్యే 5 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లకు టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న క్లార్క్‌ మీడియాతో మాట్లాడారు. శ్రీలంక పర్యటనలో వరుస సెంచరీలతో రికీపాటింగ్‌ రికార్డును సమం చేసి దూకుడు మీద ఉన్న కోహ్లి, గత కొద్దికాలంగా అన్ని ఫార్మాట్‌లలో స్థిరమైన బ్యాటింగ్‌తో రాణిస్తున్న స్టీవ్‌స్మిత్‌లలో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు క్లార్క్‌ పైవిధంగా సమాధానం ఇచ్చారు.  ఇక నాయకత్వంలో ఎవరికీ వారే సాటని, ఇద్దరూ నాయకత్వ లక్షణాలు పెంచుకొని అద్భుతంగా రాణిస్తున్నారని కితాబిచ్చారు.

 

ఇక టీమిండియా దూకుడు మీద ఉందని, ప్రస్తుత జట్టు భారత మాజీ కెప్టెన్‌ గంగూలీ నాయకత్వంలోని జట్టును గుర్తుచేస్తోందని క్లార్క్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత టీమిండియా దూకుడైన ఆటగాడి నాయకత్వంలో మంచి క్రికెట్ ఆడుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ జట్టు ఓటమిని సహించలేదని క్లర్క్‌ పేర్కొన్నారు. ఇక ఆసీస్‌ బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, హజల్‌వుడ్‌లు గాయాలతో సతమవుతుండటంతో ఈ సిరీస్‌లో కొనసాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఒక వేళ ఈ పర్యటనలో ఆసీస్‌ 4-1తో  సిరీస్‌ను గెలిస్తే వన్డే ర్యాకింగ్‌లో తొలిస్థానం దక్కించుకుంటుదన్నారు. ఇక్కడి పరిస్థితులు ఆసీస్‌ ఆటగాళ్లకు పెద్దగా ఇబ్బంది కల్గించవని ఎందుకంటే చాల మంది ప్లేయర్లు ఐపీఎల్‌ ఆడటంతో భారత్‌ వారికి రెండవ హోం గ్రౌండ్‌ అని చెప్పుకొచ్చారు.  
Back to Top