200లో 100!

virat kohli gets century in first odi against new zealand

ముంబై:టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి వన్డేలో విరాట్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఇది విరాట్ కు 31వ వన్డే సెంచరీ. తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(30 సెంచరీలు) రికార్డును కోహ్లి సవరించాడు. తన కెరీర్ లో 200వ వన్డే ఆడుతున్న కోహ్లి సెంచరీ చేయడం ఇక్కడ మరో విశేషం. అత్యంత నిలకడగా ఆడిన కోహ్లి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.

కేదర్ జాదవ్ తో 42 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన కోహ్లి.. ఆపై దినేశ్ కార్తీక్ తో కలిసి 73 పరుగుల్ని జత చేశాడు. అటు తరువాత ధోనితో కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి జత చేశాడు. కాగా, కోహ్లి సెంచరీకి చేరువ అవుతున్న తరుణంలో ధోని(25) ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు ఆదిలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ(9), శిఖర్ ధావన్(20) వికెట్లను కోల్పోయింది. ఆ సమయంలో విరాట్ కోహ్లి మరమ్మత్తులు చేపట్టాడు. అయితే కోహ్లి 29 వ్యక్తిగత స్కోరు  వద్ద ఉండగా అతనికి లైఫ్ లభించింది. న్యూజిలాండ్ బౌలర్ గ్రాండ్ హోమ్ వేసిన 19 ఓవర్ నాల్గో బంతికి కోహ్లి కవర్స్ లో ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను సాంత్నార్ వదిలేశాడు. దీన్ని చక్కగా వినియోగించుకున్న కోహ్లి మరొక లైఫ్ ఇవ్వకుండా తొలుత హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అటుపై దాన్ని సెంచరీగా మలచుకుని తన క్యాచ్ ను వదిలేసిన న్యూజిలాండ్ ఎంత పొరపాటు చేసిందో తెలియజెప్పాడు. 111 బంతుల్లో కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు. భారత బ్యాటింగ్ లో కోహ్లి తరువాత దినేశ్ కార్తీక్(37) ఫర్వాలేదనిపించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్(49) తొలి స్థానంలో ఉండగా, కోహ్లి రెండో స్థానానికి దూసుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top