కోహ్లి ఇంకొక్కటి కొడితే.. 

Virat Kohli Eyes Ponting Elite Test Record - Sakshi

అంటిగ్వా: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి క్రికెట్‌లో పరుగులతో పాటు రికార్డుల ప్రవాహం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే మహామహులకు సాధ్యంకాని రికార్డులను కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో కోహ్లి మరో అరుదైన రికార్డుపై గురిపెట్టాడు. ఈ సిరీస్‌లో ఒక్క శతకం సాధిస్తే ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన సారథిగా పాంటింగ్‌(19) రికార్డును కోహ్లి సరి చేస్తాడు. ప్రస్తుతం కోహ్లి 18 సెంచరీలతో పాంటింగ్‌ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా సారథి గ్రేమ్‌ స్మిత్‌(25) తొలి స్థానంలో ఉన్నాడు. 

ఓవరాల్‌గా టెస్టుల్లో కోహ్లి 25 శతకాలు సాధించాడు. ఇందులో సారథిగా 18 శతకాలు సాధించడం విశేషం. ఇక ఇలాంటి పరిస్థితే వన్డేల్లోనూ నెలకొంది. సారథిగా పాంటింగ్‌ 22 శతకాలు సాధిస్తే.. కోహ్లి 21 సెంచరీలతో కొనసాగుతున్నాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన సారథిగా ధోని రికార్డును కోహ్లి బ్రేక్‌ చేస్తాడు. ఇప్పటివరకు కోహ్లి 46 టెస్టులకు సారథ్యం వహించగా 26 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. గతంలో ధోని కెప్టెన్సీలో 60 టెస్టుల్లో 27 విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. 

ఇక వెస్టిండీస్‌ సిరీస్‌తోనే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ షిప్‌ను టీమిండియా ఆరంభించనుంది. ఇప్పట్నుంచి టీమిండియా ఆడే ప్రతీ టెస్టు కీలకం కానుంది. టెస్టు చాంపియన్‌ షిప్‌లో భాగంగా 2021 జూన్‌ వరకు పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఇంగ్లండ్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ ఆడతాయి.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top