కోహ్లి కోచ్‌ కూడా సెలవులోనే..

Virat Kohli Childhood Coach Rajkumar Sharma Applying for Leave - Sakshi

న్యూఢిల్లీ: ఈ నెల 12న ఇటలీలో భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి-బాలీవుడ్‌ అనుష్క శర్మల వివాహం జరగబోతోందనే వార్త గత రెండు రోజులుగా వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. హాట్ టాఫిక్‌గా మారిన  కోహ్లి, అనుష్క శర్మ పెళ్లి వార్త‌కి బలం చేకూర్చే విషయం మరొకటి వెలుగులోకి వచ్చింది.  విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ శుక్రవారం నుంచి తనకు సెలవు కావాలంటూ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) వద్ద దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం  ఢిల్లీ జట్టుకి రాజ్‌కుమార్ శర్మ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. సీకే నాయుడు అండర్-23 టోర్నీలో భాగంగా తమిళనాడుతో ఢిల్లీ జట్టు శుక్రవారం కీలకమైన సెమీ ఫైనల్‌‌ మ్యాచ్ ఆడనుంది. కాగా, రాజ్‌కుమార్ సెలవు తీసుకోవడంతో వెళుతున్న నేపథ్యంలో అతని స్థానంలో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కి ఢిల్లీ జట్టు కోచ్‌గా రాబిన్ సింగ్‌ను నియమిస్తున్నట్లు డీడీసీఏ ప్రకటించింది. తన వివాహాన్ని విరాట్‌ రహస్యంగా చేసుకునే క్రమంలోనే రాజ్‌కుమార్‌ ఉన్నపళంగా సెలవు పెట్టాడనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే వీరి వివాహానికి సంబంధించి వస్తున్న వార్తలను అనుష్క శర్మ తరపు ప్రతినిధులు ఖండిస్తున్నారు.

 

Back to Top