విరాట్‌-అనుష్కలకు 'అడిలైడ్‌' ఆహ్వానం

Virat Kohli, Anushka Sharma invited to get married at Adelaide Oval - Sakshi

అడిలైడ్‌:ప్రస్తుతం భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి-బాలీవుడ్‌ నటి అనుష్క శర్మల పెళ్లి వార్త హాట్‌ టాపిక్‌గా మారింది.  వచ్చే వారమే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త హల్‌చల్‌ చేస్తోంది. కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఇటలీలో వీరి పెళ్లి జరగబోతుందనేది గత కొన్ని రోజులుగా వైరల్‌ అయ్యింది. విరాట్‌-అనుష్క వివాహంపై అధికారిక సమాచారం ఏమీ లేకపోయినా.. 'మీ పెళ్లి మా దగ్గర చేసుకోండి' అంటూ ఆస్ట్రేలియా ప్రముఖ స్టేడియాల్లో ఒకటైన అడిలైడ్‌ ఓవల్‌ నుంచి వీరికి ఆహ్వానం వచ్చింది. సెలబ్రెటీల పెళ్లిని జరపడం తమ కోరికగా పేర్కొన్న అడిలైడ్‌ యాజమాన్యం.. విరాట్‌-అనుష్కల పెళ్లిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నట్లు తెలిపింది.'  విరాట్‌-అనుష్కల పెళ్లికి ఆతిథ్యం ఇస్తే మాకది ఒకింత గర్వకారణం. ఈ స్టేడియంలో విరాట్‌ పెళ్లి జరిగితే మరెన్నో చిరస్మరణీయమైన జ్ఞాపకాల్ని సొంతం చేసుకుంటాడు. విరాట్‌కు అడిలైడ్‌ ఓవల్‌ స్టేడియంలో మెరుగైన రికార్డు ఉంది' అని అడిలైడ్‌ సీఈవో ఆండ్రూ డానియల్స్‌ పేర్కొన్నారు.

2012లో విరాట్‌ కోహ్లి తన అరంగేట్రపు సెంచరీతో కలుపుకుని ఇక్కడ మూడు టెస్టు సెంచరీలు సాధించాడు. దాంతో పాటు అత్యధిక వ్యక్తిగత అంతర్జాతీయ టీ 20 స్కోరు కూడా అడిలైడ్‌ వేదికగానే కోహ్లి నమోదు చేశాడు. అడిలైడ్‌లో అజేయంగా చేసిన 90 పరుగులే విరాట్‌కు అత్యధిక వ్యక్తిగత టీ 20 స్కోరు. మరొకవైపు ఈ వేదికలో మొత్తం ఎనిమిది ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లి 89 సగటుతో 624 పరుగులు నమోదు చేశాడు. ఆ క్రమంలోనే విరాట్‌ పెళ్లిని ఈ చారిత్రాత్మక స్టేడియంలో జరుపుకోవాలని సీఈవో ఆండ్రూ డానియల్స్‌  కోరారు.

Back to Top