‘ఫేక్‌ ఫీల్డింగ్’ చేశాడు.. కానీ

Umpires Failed to Spot Maxwells Fake Fielding at Nagpur - Sakshi

నాగ్‌పూర్‌: రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్‌లో నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ‘ఫేక్ ఫీల్డింగ్’ను హైలైట్ చేశారు. బంతి చేతిలో లేకున్నా, దాన్ని విసిరేస్తున్నట్టు చేయడం.. బంతి ఆపకపోయినా.. తన వద్దే ఉన్నట్లు నటించడం వంటివి ఇందులోకి వస్తాయి. ఈ రూల్స్‌లో భాగంగా ఫీల్డర్‌గానీ, వికెట్ కీపర్‌గానీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తే ‘ఫేక్‌ ఫీల్డింగ్’ నిబంధనను బ్రేక్ చేసినట్లు అవుతుంది. అదే జరిగితే బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఐదు పరుగుల బోనస్ లభిస్తుంది.
(ఇక్కడ చదవండి: ధోని ముంగిట మరో ఘనత..!)

 
అప్పట్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాతి రోజే ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ జట్టైన క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఓ క్రికెటర్ ఫేక్ ఫీల్డింగ్ చేయడం వల్ల ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు కలిపారు. దీంతో అప్పటి నుంచి ఫీల్డర్లు చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. అయినా అప్పుడప్పుడూ కొందరు మాత్రం ఫేక్ ఫీల్డింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ ‘ఫేక్ ఫీల్డింగ్’ చోటు చేసుకుంది. అయితే, దానిని అంపైర్లు గుర్తించకపోవడం గమనార్హం.
(ఇక్కడ చదవండి: వన్డే సిరీస్‌పైనే టీమిండియా గురి)

రెండో వన్డేలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ‘ఫేక్ ఫీల్డింగ్’కు పాల్పడ్డాడు. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది. కల్టర్‌ నైల్‌ వేసిన ఒక ఓవర్‌లో ఓ బంతిని టీమిండియా బ్యాట్స్‌మన్ జడేజా కట్ షాట్ ఆడాడు. ఆ సమయంలో పాయింట్ వద్ద ఉన్న మ్యాక్స్‌వెల్ బంతిని అందుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అయినా.. బంతి చేతిలో ఉన్నట్లు వికెట్ల వైపు విసిరినట్లు చేశాడు. కానీ, బంతి మాత్రం థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. దీనిని అంపైర్లు గమనించి ఉంటే భారత జట్టుకు మరో ఐదు పరుగులు బోనస్‌గా లభించేవి. కానీ, వాళ్లు పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఎనిమిది పరుగుల తేడాతోనే విజయం సాధించింది. ఒకవేళ పరాజయం పాలైతే ‘ఫేక్‌ ఫీల్డింగ్‌పై పెద్ద ఎత్తున చర్చ నడిచేది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top