రెండు ఘనతలకు చేరువలో ధోని..

 two Milestones in sight for Dhoni - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మరో రెండు అరుదైన ఘనతలకు స్వల్ప దూరంలో నిలిచాడు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన నాల్గో వన్డేలో 42 పరుగులతో అజేయంగా నిలిచిన ధోని.. వన్డే కెరీర్‌లో పదివేల పరుగులు చేయడానికి ఇంకా 46 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ధోని 9,954 వన్డే పరుగులతో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఒక హాఫ్‌ సెంచరీ చేస్తే పదివేల వన్డే పరుగుల మార్కును దాటేసి ధోని.. వన్డేల్లో ఇప్పటివరకూ 295 క్యాచ్‌లను పట్టాడు. దాంతో మరో ఐదు క్యాచ్‌లు పడితే మూడొందల క్యాచ్‌లు పట్టిన ఏకైక భారత కీపర్‌గా ధోని గుర్తింపు సాధిస్తాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ధోనిని ఈ రెండు ఘనతలు ఊరిస్తున్నాయి. సఫారీలతో ఇంకా రెండు వన్డేలు మిగిలి ఉండటంతో ఈ రెండు రికార్డులను ధోని సాధించే అవకాశం ఉంది.

బ్యాట్స్‌మన్‌గా 316 వన్డే మ్యాచ్‌లకుగాను 271 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 183 నాటౌట్‌. మరొకవైపు వన్డేల్లో కీపర్‌గా 311 ఇన్నింగ్స్‌ల్లో 401 అవుట్‌లలో భాగస్వామ్యమయ్యాడు. ఇందులో 106 స్టంపింగ్స్‌ ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో వన్డేలో 400 మందిని అవుట్‌ చేయడంలో భాగమైన ధోని ఆ ఘనత సాధించిన తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఈ మార్కును చేరిన నాలుగో వికెట్‌ కీపర్‌ ధోని. అతనికి ముందు సంగక్కర (482), గిల్‌క్రిస్ట్‌ (472), బౌచర్‌ (424) ముందున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top