విజయంతో ముగించాలని...

విజయంతో ముగించాలని...


నేడు శ్రీలంకతో భారత్‌ ఏకైక టి20 మ్యాచ్‌

పరువు కోసం ఆతిథ్య జట్టు పోరాటం




భారత క్రికెట్‌ జట్టు జూలైలో శ్రీలంక గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి విజయాల వర్షంలో తడిసిముద్దవుతోంది. మూడు టెస్టులతో పాటు ఐదు వన్డేల సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ఇప్పుడు లంకతో పొట్టి ఫార్మాట్‌లో తలపడనుంది. ఈ ఒక్క మ్యాచ్‌నూ తమ ఖాతాలో వేసుకుని సుదీర్ఘ లంక పర్యటనను చిరస్మరణీయం చేసుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది. అటు చెత్త ఆటతో ఒక్క విజయానికి కూడా నోచుకోని ఆతిథ్య జట్టు కనీసం చిట్టచివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి కాస్త పరువు దక్కించుకోవాలనుకుంటోంది.   



కొలంబో: శ్రీలంక జట్టుతో టెస్టు, వన్డే ఫార్మాట్‌ అనంతరం ఇప్పుడు భారత జట్టు ధనాధన్‌ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య నేడు (బుధవారం) ఏకైక టి20 మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటిదాకా ఆడినట్టుగానే పర్యటన ఆఖరి మ్యాచ్‌లోనూ భారత జట్టు లంకపై గట్టి దెబ్బే వేయాలనుకుంటోంది. స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో మూడేసి టి20 మ్యాచ్‌లు ఉండడంతో ఈ ఫార్మాట్‌లో జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ను పరీక్షించుకునేందుకు ఈ మ్యాచ్‌ను వినియోగించుకోనుంది. ఇక సొంత గడ్డపై భారత్‌ చేతిలో చావుదెబ్బలు తింటున్న శ్రీలంక కనీసం ఒక్క విజయమైనా సాధించాలనే కసితో ఉంది. అందుకే వన్డే సిరీస్‌కు ముందే ప్రకటించిన తమ టి20 జట్టులో తిరిగి మార్పులు చేసింది. మరోవైపు భారత్‌తో జరిగిన 10 టి20ల్లో శ్రీలంక నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఆరు ఓడింది. అయితే ఈ స్టేడియంలో లంక ఆడిన మొత్తం 13 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే నెగ్గడం ఆ జట్టును ఆందోళనపరిచే విషయం.   



జోరు జోరుగా..

తమ అద్భుత ఫామ్‌ను భారత్‌ పొట్టి ఫార్మాట్‌లోనూ కొనసాగించాలనుకుంటోంది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్, విరాట్‌ కోహ్లి, ధోని ప్రత్యర్థి బౌలింగ్‌పై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఆల్‌రౌండర్‌ పాండ్యా ఈ ఫార్మాట్‌లో ఎంత ప్రమాదకరమో ఐపీఎల్‌లో రుజువైంది. ఈ పర్యటనకు ముందు విండీస్‌తో జరిగిన ఏకైక టి20లో ధావన్‌తో కలిసి కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. ఇప్పుడు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే రాహుల్, మనీష్‌ పాండే మిడిలార్డర్‌లో రానున్నారు. మనీష్‌ పాండే తను ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాణించగలిగాడు. కేదార్‌ జాదవ్‌ కూడా చివరి వన్డేలో కీలక అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా తనకు మరో అవకాశం దక్కనుంది. రహానే, శార్దుల్‌ బెంచీకే పరిమితం కానున్నారు. వన్డే సిరీస్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన పేసర్‌ బుమ్రాతో పాటు భువనేశ్వర్‌ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నారు. ఇద్దరు లెగ్‌ స్పిన్నర్లతో కలిసి ఆడేందుకు కోహ్లి ఆసక్తి చూపిస్తుండడంతో మధ్య ఓవర్లలో స్పిన్నర్లు చాహల్, కుల్దీప్‌ ప్రభావం చూపనున్నారు.



మార్పులతో లంక

ఎలాగైనా విజయం సాధించాలనే ఆలోచనతో ఉన్న లంక జట్టులో పలు మార్పులు చేసింది. లెగ్‌ స్పిన్నర్‌ జెఫ్రీ వాండర్సే, ఆల్‌రౌండర్‌ డాసున్‌ షనక జట్టులోకి వచ్చారు. గాయం నుంచి కోలుకున్న పేసర్‌ సురంగ లక్మల్‌ ఆడనున్నాడు. కెప్టెన్‌ హోదాలో తరంగకిదే తొలి టి20. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎవరూ నిలకడగా ఆడలేకపోతుండడం జట్టును ఇబ్బందిపెడుతోంది. అంతగా రాణించలేకపోతున్న సీనియర్‌ పేసర్‌ మలింగ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా భారత బ్యాటింగ్‌ను ఇబ్బందిపెట్టి జట్టుకు విజయం అందించాలనుకుంటున్నాడు.



జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, మనీశ్, కేదార్‌ జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చాహల్, బుమ్రా.

శ్రీలంక: తరంగ (కెప్టెన్‌), డిక్‌వెల్లా, మునవీర, మాథ్యూస్, సిరివర్దన, షనక/ప్రసన్న, పెరీరా, మలింగ, ధనంజయ, వాండర్సే, సంజయ.



పిచ్‌ :సాధారణ బ్యాటింగ్‌ వికెట్‌ మంగళవారం వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్‌కు దూరంగా ఉంది. నేటి మ్యాచ్‌లోనూ వర్షం ఆటంకం కలిగించవచ్చు.



సోనీ సిక్స్‌లో సా.7 గం. నుంచి ప్రత్యక్ష ప్రసారం  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top