సమరానికి సై

సమరానికి సై - Sakshi


ఉద్వేగాల పోరుకు రంగం సిద్ధం

నేడు భారత్, పాకిస్తాన్ ఢీ

టీమిండియాకు చావోరేవో

గెలిస్తేనే నిలిచే అవకాశం
 భారత జట్టు పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించేసింది. అవును... ఇది ఆటకంటే సరిహద్దు పోరుగా మారిపోయిందని అశ్విన్ చెప్పడంతోనే ఈ ప్రపంచకప్ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో అర్థమైపోయింది. టీమిండియా దృష్టిలో పాక్‌తో పోరు గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో స్పష్టమైంది.సాధారణ క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు... ప్రజల భావోద్వేగాలు కూడా దీంతో పెనవేసుకున్నాయి. కోట్లాది మంది ఆశలు ముడిపడి ఉన్నాయి. కొన్నాళ్ల క్రితమే ఇరు జట్లు తలపడి ఉండవచ్చు. కానీ పాక్ ఆడుతోంది భారత గడ్డపై. ఇక్కడ ఫలితం మనకు వ్యతిరేకంగా వస్తే తట్టుకోవడం కష్టం. నాలుగు రోజుల క్రితం ఎవరూ ఊహించలేదు... భారత జట్టు చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బరిలోకి దిగాల్సి వస్తుందని. పటిష్టమైన మన జట్టు ముందు పేలవంగా కనిపించిన పాకిస్తాన్‌తో కూడా ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆడాల్సి వస్తుందని. ఒకవైపు గత రికార్డు మనవైపు నిలబడుతుండగా... మరోవైపు కోల్‌కతా ప్రత్యర్థిపై ప్రేమ కురిపిస్తుండగా... ప్రపంచకప్‌లో నేడు చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఈడెన్ సిద్ధమైంది.

 

 

 కోల్‌కతా నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి  ప్రపంచకప్‌లో ప్రతీ అభిమాని ఉత్సుకతతో ఎదురు చూస్తున్న మ్యాచ్ వచ్చేసింది. టోర్నీ సూపర్-10 దశ గ్రూప్-2 పోరులో భాగంగా నేడు (శనివారం) జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. ఇక్కడి చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం మ్యాచ్‌కు వేదిక అవుతోంది. తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన భారత్‌పై కాస్త ఒత్తిడి ఉండగా, ఇక్కడే జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన పాక్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.తీవ్ర సాధన...

గురువారం ప్రాక్టీస్ చేసేందుకు ముగ్గురు భారత ఆటగాళ్లే రాగా, పాక్ సభ్యులు మాత్రం సీరియస్‌గా ప్రాక్టీస్ చేశారు. దీనిపై అశ్విన్, వారికి కష్టపడే స్వభావం ఎక్కువేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే మ్యాచ్ ముందు రోజు మాత్రం మన జట్టు సుదీర్ఘ సమయం పాటు సాధనలో గడపడం చూస్తే మనోళ్లు మ్యాచ్ పట్ల ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థమవుతుంది. ఒకరి తర్వాత మరొకరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఒకే రౌండ్‌తో సరిపెట్టకుండా పలువురు బ్యాట్స్‌మెన్ మరోసారి నా వంతు అన్నట్లుగా రొటేషన్‌లో పదే పదే సాధన చేస్తూ పోయారు. ముఖ్యంగా ధోని చాలా సేపు బ్యాటింగ్ చేయగా... ఆరంభంలోనే ప్రాక్టీస్ ముగిం చిన కోహ్లి అందరి సెషన్ అయిపోయిన తర్వాత మళ్లీ ప్రత్యేకంగా స్పిన్‌ను సాధన చేశాడు.బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రత్యేక శ్రద్ధతో జట్టుకు దూరంగా వేరే నెట్స్ వద్ద రోహిత్, రైనాలతో ప్రాక్టీస్ చేయిస్తూ వారికి తగిన సూచనలిచ్చాడు. బౌలర్లు కూడా అశ్విన్, హర్భజన్, నేగి నిరంతరాయంగా మన బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌కు చేయడం చూస్తే స్పిన్‌పై కాస్త ఎక్కువ దృష్టి పెట్టినట్లే కనిపించింది. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈసారి షమీ ఫిట్‌నెస్ మెరుగైనట్లు కనిపిం చింది. అతను కూడా చాలా సేపు బౌలింగ్ చేశాడు. మొత్తంగా చూస్తే భారత ఆటగాళ్లలో మాత్రం ఈ మ్యాచ్ గురించి ఒక రకమైన కసి కనిపిస్తోంది. ఇక్కడా ఓడితే టోర్నీలో భారత్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోతాయి. మూడు విజయాలు ఉంటేనే కచ్చితంగా సెమీస్ చేసే అవకాశం ఉంది. రెండు ఓడాక మరో రెండు గెలిచినా చాలా సమీకరణాలు సరిపోవాల్సి ఉంటుంది. జోష్‌లో పాక్...

ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం తర్వాత పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో 200 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా ఆ జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బాధ్యతారాహిత్యానికి చిరునామాగా కనిపించిన కెప్టెన్ ఆఫ్రిది నాలుగో స్థానంలో బరిలోకి దిగి చెలరేగడం జట్టు స్థైర్యాన్ని పెంచింది. తొలి మ్యాచ్‌లో గెలుపుతో కాస్త మెరుగైన స్థితిలో ఉన్న పాక్, భారత్‌పై వరల్డ్ కప్ రికార్డును సవరించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం భారత్ సెషన్ ముగిసిన తర్వాత పాక్ జట్టు ఫ్లడ్‌లైట్ల కింద సుదీర్ఘ సమయం పాటు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంది.   ఆమిర్‌కు అభిమానంతో...

అవసరానికి మించి ఆమిర్‌ను పొగుడుతున్నారని రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు గాక... కానీ మన స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మాత్రం ఆ కుర్రాడిపై తన అభిమానాన్ని దాచుకోలేకపోతున్నాడు. ఆసియా కప్‌లో ఆమిర్ బౌలింగ్‌పై అనేక ప్రశంసలు కురిపించిన కోహ్లి కోల్‌కతాలో మరో సారి అతడిని అభిమానంగా పలకరించాడు. కొద్ది సేపు మాట్లాడుతున్న తర్వాత కోహ్లి ... తన ప్రత్యేక బ్యాట్ ఒకదానిని ఆమిర్‌కు బహుమతిగా ఇవ్వడం విశేషం. అంతకుముందు ప్రాక్టీస్ ముగించుకున్న కోహ్లి, ఆఫ్రిది చాలా సేపు ముచ్చటించుకున్నారు.

 

 తుది జట్ల వివరాలు (అంచనా)

 భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా/షమీ. పాకిస్తాన్: ఆఫ్రిది (కెప్టెన్), షర్జీల్, షహజాద్, హఫీజ్, అక్మల్, మాలిక్, వసీం, సర్ఫరాజ్, రియాజ్, ఆమిర్, ఇర్ఫాన్.

 

 పిచ్, వాతావరణం

 పాక్, బంగ్లా మ్యాచ్ జరిగిన పిచ్‌నే ఈ మ్యాచ్ కోసం కూడా వాడుతున్నారు. కాబట్టి మరోసారి పరుగుల వరద పారే అవకాశం ఉంది. నగరంలో వాతావరణం సాధారణంగా ఉంది. వార్మప్ మ్యాచ్‌లనుంచి ఒక్కసారి కూడా మ్యాచ్‌లకు ఇబ్బంది ఎదురు కాలేదు. శనివారం కూడా వర్ష  సూచన లేదు.

 

ఈ మ్యాచ్ అంటే యాషెస్ పోరుకంటే ఎక్కువ. పాక్‌తో పోరు అంటే ప్రజలు ఉద్వేగంగా మారిపోతారు. అయితే ఆటగాళ్లుగా మేం అలాంటి భావనలను మైదానం బయట వదిలేసి బాగా ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఒక మ్యాచ్ ఓడాం సరే, ఇక ముందు మేం మరింత ప్రమాదకర ప్రత్యర్థులమని ఎందుకు అనుకోకూడదు.   - అశ్విన్, భారత బౌలర్

 

కచ్చితంగా మాకంటే భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వరల్డ్ కప్ అంటే మేం ఓడిపోతామని అందరి మనసుల్లో అలా నాటుకుపోయింది. చరిత్ర మాకు అనుకూలంగా లేకపోయినా చరిత్ర మారుతుంది కూడా. మేం దీనిని క్రికెట్‌లాగే చూస్తున్నాం తప్ప వారిలా సరిహద్దు సమస్యలా కాదు. నిజాయితీగా చెప్పాలంటే ఇవన్నీ కలగలిస్తే గతంలోకంటే ఈసారి మేం గెలిచే అవకాశాలు మరింత మెరుగ్గా ఉన్నాయని మాత్రం చెప్పగలను.  -వఖార్ యూనిస్, పాకిస్తాన్ కోచ్


 


 రాత్రి గం. 7.30నుంచి

  స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top