రాహుల్‌ ద్రవిడ్‌దే ఆ ఘనత 

sunil gavaskar praises to rahul dravid - Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

ముందుగా ఐసీసీ అండర్‌–19 ప్రపంచకప్‌ చాంపియన్లకు అభినందనలు. భారత కుర్రాళ్లు కప్‌ గెలిచినందుకు కాదు... గెలిచిన తీరుకు హ్యాట్సాఫ్‌. ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా ఆడారు. అసాధారణ తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించి మరే జట్టుకు అందనంత శిఖరాగ్రస్థాయిలో నిలిచింది యంగ్‌ టీమిండియా. ప్రతి మ్యాచ్‌లో ఒకరు నిలబడితే మిగతావారు అండగా నిలిచారు. కొందరైతే టోర్నీ అసాంతం నిలకడను కనబరిచారు. దీంతో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ భారత్‌ అవలీలగా గెలిచింది. ఇందుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దక్షతే కారణం. కచ్చితంగా ఈ ఘనత అతనిదే! ఇందులో ఏ సందేహం లేదు. కొన్నేళ్లుగా బీసీసీఐ కూడా జూనియర్‌ క్రికెట్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వచ్చింది. వివిధ దేశాల్లో పర్యటనలు, క్రమం తప్పకుండా సిరీస్‌లు ఏర్పాటు చేయడంతో కుర్రాళ్లు రాటుదేలారు. ఫైనల్లో విల్‌ సదర్లాండ్‌... పృథ్వీ షాను తొలి వికెట్‌గా పడగొట్టగానే టీవీ కెమెరాలు అతని తండ్రి, క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్‌ సదర్లాండ్‌ వైపు తిరిగాయి. అది భారత్‌ కాదు కాబట్టి జేమ్స్‌ అదృష్టవంతుడు. లేదంటే పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందాడని ఆయనపై ధ్వజమెత్తేవారు. రాజీనామా తప్పేది కాదు. అయితే అది ఆసీస్‌ కాబట్టి ఇవేవి జరగలేదు. ఆయనే కాదు... బిగ్‌బాష్‌ టి20 టోర్నీకి టీవీ వ్యాఖ్యాతలుగా చేసిన ఆసీస్‌ సెలెక్టర్‌ మార్క్‌ వా, టి20 సహాయ కోచ్‌ పాంటింగ్‌పై ఇలాంటి దుమారమే రేగేది. భారత్‌లో ఆ వ్యక్తి నిజాయతీని, సామర్థ్యాన్ని నమ్మరు. విశేషానుభవంతో అన్ని బాధ్యతలకూ న్యాయం చేస్తున్నప్పటికీ తమ అసూయద్వేషాల్ని వెళ్లగక్కుతారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలంటూ ఆపాదిస్తారు.  

ఇక సీనియర్‌ జట్టు విషయానికొద్దాం. సఫారీ గడ్డపై టెస్టుల్లో అందివచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌ను గెలిచే స్థితిలో ఉంది. కని.. కనిపించని పచ్చికపై స్పిన్నర్లు తమ మ్యాజిక్‌ను చూపెట్టారు. ప్రొటీస్‌ బ్యాట్స్‌మెన్‌ను అదేపనిగా తిప్పేశారు. బుధవారం జరిగే వన్డే గెలిస్తే ఈ వారమే కోహ్లి సేన చేతికి సిరీస్‌ వచ్చినట్లే! తాజాగా గాయంతో డికాక్‌ కూడా దూరమయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లైనప్‌ అనుభవలేమితో ఉంది. గాయపడ్డ డు ప్లెసిస్‌ స్థానంలో సఫారీ సెలక్టర్లు రెండే వన్డేలాడిన మార్క్‌రమ్‌కు జట్టు పగ్గాలివ్వడం ఆశ్చర్యం కలిగించింది. అతను ఐసీసీ అండర్‌–19 ప్రపంచకప్‌ (2014)లో సారథ్యం వహించినా... అది గడిచి చాలా కాలమైంది. జూనియర్, సీనియర్‌ జట్లకు ఎంతో తేడా ఉంటుంది. అయినా సరే దక్షిణాఫ్రికా సెలెక్టర్లు అతన్ని భావి కెప్టెన్‌ (పూర్తిస్థాయి)గా భావిస్తున్నారేమో! సారథులపై ఒక్కో క్రికెట్‌ బోర్డుకు ఒక్కో విధమైన అలోచన, అంచనాలుంటాయి. భారత్‌లో అయితే సత్తా, సామర్థ్యం సమానస్థాయిలో ఉంటే... చక్కగా ఇంగ్లిష్‌ మాట్లాడగలిగే ఆటగాడికి కెప్టెన్‌ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలుటాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top