మొండి ధైర్యం ప్రదర్శించిన స్మిత్‌

Steve Smith Returns to Bat After Nasty Blow to the Neck - Sakshi

మాజీ కెప్టెన్‌ మరో గొప్ప ఇన్నింగ్స్‌

మెడకు దెబ్బ తగిలినా ఆట కొనసాగింపు

ఆస్ట్రేలియా 250 ఆలౌట్‌

యాషెస్‌ రెండో టెస్టు

లండన్‌: అది ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 77వ ఓవర్‌. మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 152 బంతుల్లో 80 పరుగులతో ఆడుతున్నాడు. క్రీజు మొత్తం నాదే అన్నట్లు కదులుతూ, మంచి బంతులను దీటుగా ఆడుతూ, వీలు చిక్కితే బౌండరీలు బాదుతూ ఇంగ్లండ్‌ బౌలర్లకు చిర్రెత్తిస్తున్నాడు. నిలకడగా 145 నుంచి 155 కి.మీ. వేగంతో వస్తున్న ఆర్చర్‌ బంతులను కాచుకుంటూ జట్టు స్కోరును 200 దాటించాడు. అప్పటికీ ఆర్చర్‌ వేసిన 71వ ఓవర్‌ చివరి బంతి బలంగా తగిలి స్మిత్‌ ఎడమచేయి వాచిపోయింది.

అయినా, మొండిగా ఆడిన అతడు 80ల్లోకి వచ్చాడు. సెంచరీ చేసేలా కనిపించాడు.అంతలోనే అనూహ్య ఘటన...! పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వేసిన 77వ ఓవర్‌ రెండో బంతి నేరుగా స్మిత్‌ మెడకు తగిలింది. 149 కిలోమీటర్ల వేగంతో షార్ట్‌ లెంగ్త్‌లో వచ్చిన ఆ బంతిని తప్పించుకోలేకపోయిన అతడు కుప్పకూలాడు. వెల్లకిలా పడుకుని నొప్పితో విలవిల్లాడాడు. మైదానంలో ఒక్కసారిగా కలవరం. జట్టు డాక్టర్‌ పరుగు పరుగున వచ్చాడు. ఆర్చర్‌ మినహా ఇంగ్లండ్‌ ఆటగాళ్లు స్మిత్‌ చుట్టూ చేరిపోయారు. 2014 నాటి ఫిల్‌ హ్యూస్‌ ఉదంతం తలచుకుని అటు ఆస్ట్రేలియా టీంలోనూ కంగారు.కాస్త దిమ్మెరపోయినప్పటికీ స్మిత్‌ వెంటనే పైకి లేచాడు. డాక్టర్‌తో సంభాషించి రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు.

అయితే 9 ఓవర్ల అనంతరం వచ్చి వోక్స్‌ బౌలింగ్‌లో రెండు వరుస బౌండరీలు బాదాడు. వోక్స్‌ మరుసటి ఓవర్లో ఓ ఫోర్‌ కొట్టి వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో యాషెస్‌ రెండో టెస్టు నాలుగో రోజు శనివారం ఇరు జట్ల ఆట కంటే ఈ ఘటనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొత్తానికి సెంచరీ చేజారినా స్టీవ్‌ స్మిత్‌ (161 బంతుల్లో 92; 14 ఫోర్లు) మరో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను ఆదుకున్నాడు. అతడి పోరాటంతో తొలి ఇన్నింగ్స్‌లో జట్టు 250 పరుగులకు ఆలౌటై ఇంగ్లండ్‌ స్కోరు (258)కు దగ్గరగా వచ్చింది. 8 పరుగుల స్వల్ప ఆధిక్యంతో అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆతిథ్య జట్టును కమిన్స్‌ (2/16), సిడిల్‌ (2/19) దెబ్బకొట్టారు. కెప్టెన్‌ జో రూట్‌ (0)డకౌట్‌ అయ్యాడు. రోజు ముగిసేసరికి ఇంగ్లండ్‌ 96/4 తో నిలిచింది. ఆ జట్టు 104 పరుగుల ఆధిక్యంలో ఉంది.  

స్మిత్‌ వర్సెస్‌ ఆర్చర్‌
ఓవర్‌నైట్‌ స్కోరు 80/4తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌కు ఎప్పటిలాగే స్మిత్‌ ఆపద్బాంధవుడయ్యాడు. మాథ్యూ వేడ్‌ (6) తొందరగానే ఔటైనా, కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ (70 బంతుల్లో 23; 2 ఫోర్లు); కమిన్స్‌ (80 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. ఈ క్రమంలోనే యాషెస్‌లో వరుసగా ఏడో అర్ధ శతకాన్ని (107 బంతుల్లో) సాధించాడు.  ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ లంచ్‌ తర్వాత స్మిత్‌ వర్సెస్‌ ఆర్చర్‌గా సాగింది. ఆర్చర్‌ వేసిన 8 ఓవర్ల స్పెల్‌ భీకరంగా సాగింది. స్మిత్‌కు 73వ ఓవర్‌ చివరి బంతిని అతడు 155 కి.మీ. వేగంతో సంధించడం గమనార్హం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top