వార్నర్‌, స్మిత్‌లపై నిషేధం ముగిసింది..

Steve Smith, David Warner Bans End - Sakshi

సిడ్నీ:  ఆసీస్‌ క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లపై విధించిన నిషేధం ముగిసింది. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో వారిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం నేటితో పూర్తి కావడంతో వారు తిరిగి దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు రంగం సిద్ధమైంది. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ల నిషేధం ముగిసిందన్న విషయాన్ని ఆసీస్‌ క్రికెట్‌ చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ వెల్లడించారు. ఇక నుంచి వారు స్వేచ్ఛగా అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొనవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   అయితే నిషేధం ముగిసిన రోజే ఈ ఇద్దరు క్రికెటర్లు మన హైదరాబాద్‌లో ఉన్నారు. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది.

అయితే వీళ్ల రాకతో అటు ఆస్ట్రేలియా టీమ్‌లో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రధానంగా బాల్‌ ట్యాంపరింగ్‌కు కారకుడైన వార‍్నర్‌ రాకను మిచెల్‌ స్టార్క్‌, హజల్‌వుడ్‌, నాథన్‌ లయన్‌, ప్యాట్‌ కమిన్స్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఒక కథనంలో పేర్కొంది. ఇక ఇద్దరి రాకతో అటు ఆస్ట్రేలియా సెలక్టర్లకు కూడా కొత్త తలనొప్పులు వచ్చాయి. ఈ మధ్య ఆస్ట్రేలియా వన్డే జట్టు మళ్లీ గాడిలో పడింది. భారత్‌, పాకిస్తాన్‌లపై వరుసగా సిరీస్‌ గెలిచింది. ప్రస్తుతం టీమ్‌లో అందరూ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో ఈ ఇద్దరు స్టార్ బ్యాట్స్‌మెన్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయడం సెలక్టర్లకు సవాల్‌గా మారింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top