వైజాగ్‌ ధోని సొంత మైదానమే!

Stats reveal big worry for MS Dhoni and Co ahead of Delhi clash - Sakshi

ఐపీఎల్‌ ఫైనల్లో ముంబైతో తలపడే జట్టు ఏదో తేల్చే క్రమంలో అనుభవానికి, యువతరానికి మధ్య పోరు జరగబోతోంది. ఢిల్లీ కోణంలో చూస్తే వారి ప్రయాణం మిశ్రమానుభూతులతో సాగింది. కొన్ని గుర్తుంచుకోదగ్గ అద్భుత ప్రదర్శనలతో పాటు మరికొన్ని మరచిపోదగ్గ చేదు జ్ఞాపకాలు కూడా వారితో ఉన్నాయి. టీమ్‌లో యువ ఆటగాళ్ల బ్యాటింగ్‌ నిజంగా చూడముచ్చటగా సాగింది. ముఖ్యంగా యువతరానికి తగినట్లుగా నిర్భయంగా, నమ్మశక్యం కాని రీతిలో వారు కొన్ని రకాల షాట్లు ఆడారు. అయితే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ముగించాల్సిన మ్యాచ్‌ను కూడా అదే ఆవేశంతో తప్పుడు షాట్లు ఆడి పోగొట్టుకోవడం కూడా దీని వల్లే జరిగింది. ఇలాంటి విషయంలో అనుభవంతో నేర్చుకుంటారు. ఆ జట్టు వేగంగా నేర్చుకుందనే భావిస్తున్నా. ఎందుకంటే హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి కీమో పాల్‌ తమ జట్టును గెలిపించిన తీరు దీనికి చక్కటి ఉదాహరణ. 

ఢిల్లీ జట్టును చూస్తే ఉత్సాహం ఉరకలెత్తుతున్నట్లు కనిపిస్తుంటే ఇటు కెప్టెన్‌ కూల్‌ నేతృత్వంలో మైదానంలో ఎలాంటి టెన్షన్‌ లేకుండా చెన్నై పోరుకు సిద్ధమవుతోంది. ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు కూడా ఆ జట్టు సభ్యులు పెద్దగా భావోద్వేగాలు కనబర్చరు. వికెట్‌ తీసినప్పుడు ఇమ్రాన్‌ తాహిర్‌ ఒక్కడే దీనికి మినహాయింపు. అతను డీప్‌ కవర్‌ వైపు పరుగెత్తే తీరు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.  ఆటను ఎంతగా ఆస్వాదించవచ్చో ఆ టేకాఫ్‌లో మనకు కనిపిస్తుంది. ఓవర్లో ఆరు బంతులు వేయడం కంటే దీని వల్లే అతను ఎక్కువగా అలసిపోతాడేమో. భారీ హిట్టర్లకు కూడా తెలివైన లైన్‌తో భిన్నమైన బంతులు వేయడం వల్లే అతనికి వికెట్లు దక్కుతున్నాయి.

ఈ ప్రదర్శనతో తన విలువేంటే అతను మళ్లీ మళ్లీ చూపించాడు.  ధోని క్రీజ్‌లోకి వస్తే చెన్నై నగరం మరొక్కసారి స్తంభించిపోతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లలో అతని ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాలి. భుజ బలం ప్రదర్శించడానికి ముందే అతను పిక్కబలం చూపిస్తూ అనూహ్య రీతిలో సింగిల్స్‌ తీయగలడు. చాలా మంది ఒక పరుగే తీసే చోట రెండు తీస్తే, పరుగు రాదని భావించిన చోట కచ్చితంగా సింగిల్‌ తీస్తాడు. కపిల్, సచిన్‌ తర్వాత ప్రతి వేదికను సొంత మైదానంగా మార్చుకోగల స్థాయి ధోనిది మాత్రమే. తాను ఏం చేయగలడో కొన్నేళ్ల క్రితం ధోని చేసి చూపించిన వేదిక వైజాగ్‌. అలాంటి  మరచిపోలేని ఇన్నింగ్స్‌కు మరోసారి వైజాగ్‌ వేదిక కావచ్చు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top