పాక్ పై శ్రీలంక కొత్త చరిత్ర

Sri Lanka first side to win a series against Pakistan in UAE - Sakshi

దుబాయ్:పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై శ్రీలంక జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. పాక్ తో ఇక్కడ జరిగిన రెండో టెస్టులోనూ లంకేయులు విజయం సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించారు. రెండో టెస్టులో శ్రీలంక 68 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. తద్వారా 2010 నుంచి చూస్తే యూఏఈలో పాక్ పై టెస్టు సిరీస్ ను గెలిచిన తొలి జట్టుగా లంకేయులు చరిత్రకెక్కారు.

లంకేయుల నిర్దేశించిన 317 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్ లో 248 పరుగులకే పరిమితమై ఓటమి పాలయ్యారు. పాక్ ఆటగాళ్లలో ఆసద్ షఫిక్(112), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(68) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. శ్రీలంక స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా ఐదు వికెట్లు సాధించి పాక్ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా రంగనా హెరాత్ రెండు వికెట్లు, లక్మాల్, గమేజ్, నువాన్ ప్రదీప్ లు తలో వికెట్ తీశారు.

గత ఏడేళ్లుగా యూఏఈ తటస్థ వేదికగా జరిగిన టెస్టు సిరీస్ లను పాకిస్తాన్ ఎప్పుడూ కోల్పోలేదు. గతంలో ఇక్కడ జరిగిన తొమ్మిది సిరీస్ లను పాక్ ఏనాడు చేజార్చుకోలేదు. 2009 లో పాకిస్తాన్ లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తరువాత యూఏఈలో జరిగిన తొమ్మిది సిరీస్ ల్లో పాక్ ఐదింట విజయం సాధించగా, నాల్గింటిని డ్రా చేసుకుంది.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 482 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 96 ఆలౌట్

పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 262 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్  248 ఆలౌట్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top