ఆసీస్‌ గెలిచిందోచ్‌ 

 South Africa v Australia : South Africa lost in the second ODI - Sakshi

రెండో వన్డేలో దక్షిణాఫ్రికా పరాజయం

అడిలైడ్‌: వన్డే ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు ఎట్టకేలకు ఓ గెలుపు. ఏడు వరుస ఓటముల తర్వాత ఉత్కంఠను అధి గమించి ఓ విజయం. శుక్రవా రం దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆసీస్‌ 48.3 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ (41; 4 ఫోర్లు), క్రిస్‌ లిన్‌ (44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ (47; 4 ఫోర్లు) తలో చేయి వేశారు. సఫారీ బౌలర్లలో రబడ (4/54), ప్రిటోరియస్‌ (3/32), స్టెయిన్‌ (2/31) రాణించారు.

232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 224 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (47; 3 ఫోర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (51; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఐదో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు ఔటయ్యాక దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టొయినిస్‌ (3/35), స్టార్క్‌ (2/51), హాజల్‌వుడ్‌ (2/42) ప్రత్యర్థిని దెబ్బతీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్‌ ఆదివారం హోబర్ట్‌లో జరుగుతుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top