మిస్టర్‌ కూల్‌ షాకయ్యాడు! : గంగూలీ

Sourav Ganguly Praised MS Dhonis Greatness - Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌, ‘మిస్టర్‌ కూల్‌’గా పేరుగాంచిన ఎంఎస్‌ ధోనిని చూస్తే తనకెంతో గర్వంగా ఉందన్నాడు దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ. దేశంలోని తూర్పు ప్రాంతాల నుంచి ఆటగాళ్లే చాలా తక్కువగా ఉంటారని, అలాంటి సమయంలో పుట్టుకొచ్చిన గొప్ప క్రికెటర్‌ ధోని అని కొనియాడాడు. తూర్పు ప్రాంతం (పశ్చిమ బెంగాల్‌) నుంచి వచ్చిన తొలి కెప్టెన్‌ని తాను కాగా, రెండో​ క్రికెటర్‌ ధోని (జార్ఖండ్‌) అని గంగూలీ తెలిపాడు. ఆ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లు ఎక్కవగా లేని సమయంలో జట్టులోకి వచ్చిన ధోని ఎన్నో అద్భుతాలు సాధించాడని చెప్పారు.

‘తొలుత మొదటి టీ20 ప్రపంచకప్‌ ను అందించిన ధోని సారథ్యంలోనే భారత్‌ 2011 వన్డే వరల్డ్‌కప్‌తో పాటు 2013లో చాంపియన్స్‌ ట్రోఫిని ముద్దాడింది.​ నేను ఓవరాల్‌గా దాదాపు 450 మ్యాచ్‌లాడా. ధోని మాత్రం సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగిస్తూ 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ధోని జట్టులోకి వచ్చిన కొత్తలో 2004లో పాకిస్తాన్‌తో విశాఖపట్నంలో జరిగిన వన్డేలో ప్రయోగం చేసి ఫలితం సాధించా. 7వ స్థానంలో రావాల్సిన ధోనిని 3వ స్థానం (వన్‌డౌన్‌)లో బ్యాటింగ్‌కు వెళ్లమన్నా. షాకయిన ధోని మరి నువ్వు అని అడిగితే.. నేను 4వ స్థానంలో దిగుతా అని చెప్పా. ఆమ్యాచ్‌లో ధోని వీరవిహారం చేసి 148 పరుగులు సాధించాడు. నాణ్యమైన ఆటగాళ్లు ఇలాగే పుట్టుకొస్తారని’ గంగూలీ వివరించాడు.

తన కెప్టెన్సీలో విదేశాల్లో భారత క్రికెట్‌ జట్టు విజయాల బాట పట్టగా, ధోని కెప్టెన్‌ అయ్యాక పెద్ద పెద్ద జట్లపై కూడా సిరీస్‌లు అందించాడు. భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా(2009లో) జట్టును అగ్రస్థానంలో నిలిపాడు ధోని. అయితే తన కెప్టెన్సీలో యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రా, ఎంఎస్‌ ధోని లాంటి నాణ్యమైన క్రికెటర్లు జాతీయ జట్టులోకి వచ్చారని గౌరవ్‌ కపూర్‌ నిర్వహించే బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌ షోలో గంగూలీ గుర్తు చేసుకున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top