హ్యాపీ బర్త్‌ డే దాదా!

Sourav Ganguly Birthday Special - Sakshi

‘భారత జట్టు తరపున అతను బరిలోకి దిగడాన్ని ఎప్పుడైతే చూస్తారో అప్పుడే ఆట మొదలైందని గ్రహించాలి. అతన్ని ఇష్టపడటమో.. ద్వేషించడమో అస్సలు చేయవద్దు. అతనికి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి’  అని ఆస్ట్రేలియా దిగ్గజం కెప్టెన్‌ స్టీవ్‌ వా నోట భారత దిగ్గజ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలి గురించి వచ్చిన మాట.

గంగూలీ మైదానంలోకి అడుగుపెడితే ప్రత్యర్థులకు అంత హడల్‌. క్రికెట్‌కు దూకుడు పరిచయం చేసిన ఆటగాడు. సిక్స్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో చిక్కుకున్న భారత జట్టుకు ఊపిరి పోసిన సారథి. మైదానంలో తిరుగులేని శక్తిగా, భారత క్రికెట్‌ ముఖచిత్రంగా ఎదిగిన ఈ రథ సారథి 47వ ఏట అడుగెడుతున్న సందర్భంగా మరిన్ని విశేషాలు..

నేను బాటిళ్లు అందివ్వను..
1972 జూలై 8న జన్మించిన గంగూలీ పూర్తి పేరు సౌరవ్‌ చండీదాస్‌ గంగూలీ. కానీ అందరూ ముద్దుగా పిలుకునే పేరు దాదా. లెఫ్టార్మ్‌ బ్యాట్స్‌మన్‌ అయిన గంగూలీ రంజీల్లో రాణించి అంతర్జాతీయ వన్డేల్లోకి 1992లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో దారుణంగా విఫలమై.. తన దూకుడుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆటగాళ్లకు డ్రిం​క్స్‌ అందించనని, అది తన ఉద్యోగం కాదని సీనియర్‌ ఆటగాళ్లు, జట్టు మేనేజ్‌మెంట్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో గంగూలీని వెంటనే జట్టులోనుంచి తీసేశారు. అనంతరం మళ్లీ రంజీల్లో తనదైన శైలిలో అదరగొట్టాడు. అయినా సెలక్టర్లు కనికరించలేదు. అనంతరం దులీప్‌ ట్రోఫీలో చేసిన 175 పరుగులు ఇన్నింగ్స్‌ మళ్లీ దాదాకు అవకాశం కల్పించింది. ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యేలా చేసింది. ఒకే వన్డేలో అవకాశం వచ్చినప్పటికి గంగూలీ ఆకట్టుకోలేకపోయాడు. కానీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ-అజారుద్దీన్‌ల మధ్య గొడవ గంగూలీకి టెస్టు మ్యాచ్‌ ఆడే అవకాశం ఇచ్చింది. ఈ గొడవతో సిద్దూ స్వదేశం పయనమవ్వగా.. అతని స్థానంలో గంగూలీ లార్డ్స్‌ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసి సెంచరీ సాధించాడు. అక్కడి నుంచి ఇక గంగూలీకి తిరుగేలేదు. 1999 ప్రపంచకప్‌లో శ్రీలకంపై 158 బంతుల్లో 183 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ గంగూలీ అభిమానుల మదిలో ఇంకా కదలాడుతోంది. 

ముందు కొచ్చిన దాదా
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతం భారత్‌ క్రికెట్‌ను అంధకారంలోకి నెట్టింది. ఫిక్సింగ్‌ ఆరోపణలతో చాలా మంది సీనియర్‌ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరూ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో దాదా ఆ బరువునెత్తుకున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌, 2000 ఐసీసీ నాకౌట్‌ ట్రోఫీ ఫైనల్‌కు చేరడంతో గంగూలీ మంచి నాయకుడిగా గుర్తింపు లభించింది. ఐసీసీ నాకౌట్‌ సిరీస్‌లో దాదా రెండు సెంచరీలు చేశాడు. ఫైనల్లో న్యూజిలాండ్‌ గెలిచినప్పటికీ ఆటగాడిగా దాదా అభిమానులను సంపాధించుకున్నాడు. 

టాస్‌కు ఆలస్యం..
2001లో ఆస్ట్రేలియాతో 3 టెస్టులు 5 వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా దాదా టాస్‌కి 4 సార్లు ఆలస్యంగా వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌వాకు వ్యతిరేఖంగానే దాదా అలా చేశాడని ప్రచారం జరిగింది. ఈ టెస్టు సిరీస్‌ భారత్‌ గెలవగా.. సిరీస్‌ రెండో మ్యాచ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌ (281), రాహుల్‌ ద్రవిడ్‌ (180) అత్యుత్తమ ప్రదర్శనతో రికార్డు నెలకొల్పారు.

చొక్కావిప్పి గాల్లోకి విసిరేసి..
ఇంగ్లండ్‌తో నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ గెలవడంతో దాదా లార్డ్స్‌ మైదానంలో తన చొక్కావిప్పి గాల్లోకి విసిరేసి ఆనందం వ్యక్తం చేశారు.  గంగూలీ అనగానే ప్రస్తుతం అందరికి గుర్తుకొచ్చే సన్నివేశం ఇదే. ఈ మ్యాచ్‌లో యువరాజ్‌సింగ్, మహ్మద్‌కైఫ్‌ తమ సత్తా చాటారు.

2003 ప్రపంచకప్‌..
గంగూలీ నాయకత్వంలోనే భారత్‌ 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరింది. ఈ టోర్నీలో గంగూలీ కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా 3 సెంచరీలతో 465 పరుగులు చేసి ముఖ్యపాత్ర పోశించాడు.

  • టెస్టుల్లో దాదా నాయకత్వంలో భారత్‌ 2001లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, 2002లో జింబాంబ్వే, వెస్టిండీస్‌ సిరీస్‌లు గెలిచింది.
  • 2005 ఫామ్‌ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. అప్పటి వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌కు కెప్టెన్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. 
  • 2005లో గ్రేగ్‌చాపెల్‌ భారత జట్టుకు కోచ్‌ అయిన అనంతరం చాపెల్‌కు దాదాకు సైలెంట్‌ వార్‌ నడిచింది. బీసీసీఐకి చాపెల్‌  ‘గంగూలి నాయకత్వానికి సరికాడు అతన్ని కెప్టెన్సీ నుంచి దూరం చేయాలని రాసిన మెయిల్‌ మీడియాకు లీక్‌ అయింది. మీడియా మెత్తం గంగూలీకి మద్దతు పలికింది. ఈ విషయం అప్పట్లో పెద్ద వివాదస్పదమైంది.
  • గంగూలీ నాయకత్వంలో సెహ్వాగ్, హర్బజన్, జహీర్, యువరాజ్, కైఫ్,లు అంతార్జాతీయ క్రికెట్లోకి వచ్చారు. ధోని కూడా దాదా కెప్టెన్సీలోనే వచ్చాడు.
  • గంగూలీ  ఆటో బయోగ్రఫీ‘ ఏ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌’

తొలిటెస్ట్‌:ఇంగ్లండ్‌పై 1996, చివరిటెస్ట్‌: ఆస్ట్రేలియాపై 2008
తొలి వన్డే: వెస్టిండీస్‌ పై 1992, చివరివన్డే: పాకిస్తాన్‌ పై 2011

కెప్టెన్‌గా దాదా..

ఫార్మాట్‌  మ్యాచ్‌లు గెలుపు ఓటమి డ్రా
వన్డే  146    76   65 5
టెస్టు  49     21   13    15

పరుగుల రికార్డు.. 

ఫార్మాట్‌ టెస్టు వన్డే    
మ్యాచ్‌లు     113    311    
 పరుగులు    7,212 11,363  
100/50  16/35     22/72    
అత్యధిక  స్కోరు      239         183  
బౌలింగ్‌ ( బంతులు)        3,117      4,561          
వికెట్లు   32   100
క్యాచ్‌లు   71  100      
బెస్ట్‌ బౌలింగ్‌ 3/28         5/16
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top