'కోహ్లి డిమాండ్‌ సబబే'

Sourav Ganguly Backs Virat Kohli's Demand For Pay Hike - Sakshi

న్యూఢిల్లీ:తమ వార్షిక కాంట్రాక్టు ఫీజును పెంచాలని కోరుతూ ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి డిమాండ్‌కు సౌరవ్‌ గంగూలీ మద్దతు పలికాడు. ఆ డిమాండ్‌ లో ఎటువంటి తప‍్పిదం లేదంటూ అండగా నిలిచాడు. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి రెవెన్యూ అనూహ్యం పెరిగిన నేపథ్యంలో కోహ్లి డిమాండ్‌ సరైనదిగానే గంగూలీ తెలిపాడు. ' ఆటగాళ్లకు తగినంత ఫీజు ఉండాలి. బోర్డుకు ఆదాయం వస్తున్నప్పుడు ఆటగాళ్లు అధిక మొత్తం ఫీజును కోరడంలో తప్పేమిటి. కోహ్లి ఆటను దేశం మొత్తం చూస్తుంది.. వార్షిక ఫీజును రెట్టింపు చేయాలని కోహ్లి కోరడం న్యాయబద్ధంగానే ఉంది' అని గంగూలీ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంచితే, వార్షిక కాంట్రాక్టు చెల్లింపులు పెంచేందుకు కొత్త పరిపాలక కమిటీ (సీఓఏ), భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, మాజీ కెప్టెన్‌ ధోని, కోచ్‌ రవిశాస్త్రిలు క్రికెట్‌ వర్గాలతో గురువారం ఇక్కడ సమావేశమయ్యారు. ఇందులో సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి పాల్గొన్నారు. ‘ఆటగాళ్లతో విస్తృతస్థాయి చర్చలు జరిగాయి. ఇందులో ఆడాల్సిన మ్యాచ్‌ల సంఖ్య, భవిష్యత్‌ పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ), వేతన భత్యాలపై కూలంకషంగా చర్చించాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కెప్టెన్, కోచ్‌లు త్వరలోనే మాకు అందజేయగానే తుది నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్లకు ఆటే కాదు... విశ్రాంతి కూడా అవసరమే’ అని వినోద్‌ రాయ్‌ అన్నారు.

ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్‌ ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులో భాగంగా రూ. 2 కోట్లు.. బి, సి గ్రేడ్‌ ఆటగాళ్లకు వరుసగా రూ. కోటి, రూ. 50 లక్షలు చెల్లిస్తున్నారు. టెస్టులాడే తుది జట్టు సభ్యులకు రూ. 15 లక్షల చొప్పున, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20లకైతే రూ.3 లక్షల చొప్పున ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజుగా ఇస్తున్నారు. తుది జట్టులో లేని ఆటగాళ్లకు అందులో సగం మొత్తాన్ని ఇస్తారు. దీనిపై  ఈ నెల 11న జరిగే బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎమ్‌)లో తుది నిర్ణయం వెలువడనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top