వారెవ్వా సింధు

Sindhu Defeats Chinas Chen Yufei To Reach Finals - Sakshi

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఫైనల్‌కు చేరారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌ పోరులో సింధు 21-7, 21-14 తేడాతో చెన్‌ యుఫె (చైనా)పై గెలిచి తుది పోరుకు అర్హత సాధించారు. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సింధు.. రెండో గేమ్‌లో మాత్రం కాస్త శ్రమించి గేమ్‌తో పాటు ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు. 40 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు ఏకపక్ష విజయం సాధించి శభాష్‌ అనిపించుకున్నారు. సుదీర్ఘ ర్యాలీలతో ఆకట్టుకున్న సింధు.. కచ్చితమైన ఎటాక్‌తో చెన్‌ యుఫెను ఆటాడుకున్నారు.

ఫలితంగా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో సింధు వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరినట్లయ్యింది.  అంతకుముందు సెమీస్‌కు చేరడంతోనే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు..  ఈ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా ఐదు పతకాలు నెగ్గిన రికార్డు చైనా ప్లేయర్‌ జాంగ్‌ నింగ్‌ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సమం చేశారు.  తాజా ప్రదర్శనతో సింధు రజతాన్ని ఖాతాలో వేసుకున్నారు.  ఆదివారం జరుగనున్న తుది పోరులో రచనాక్‌ ఇంతానాన్‌తో కానీ ఒకుహారాతో కానీ సింధు తలపడనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top