విజయ్ స్థానంలో ధావన్

విజయ్ స్థానంలో ధావన్


ముంబై: శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ కు అనూహ్యంగా చోటు దక్కింది. గాయంతో బాధపడుతున్న మురళీ విజయ్ స్థానంలో ధావన్ ను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల శ్రీలంకకు పర్యటనలో భాగంగా భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో మురళీ విజయ్ ఊహించినట్లుగానే చోటు దక్కించుకున్నాడు. అయితే అతని మణికట్టు గాయం ఇంకా నయం కాకపోవడంతో ధావన్ ను జట్టులోకి వచ్చాడు. దాదాపు మూడు నెలల క్రితం మురళీ విజయ్ తన మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ గాయం నుంచి కోలుకోవడానికి విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి గాలేలో తొలి టెస్టు జరుగుతుంది.  ఈ ద్వైపాక్షిక సిరీస్ లో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక ట్వంటీ 20 జరుగనుంది.  ఇలా ఇరు జట్ల మధ్య మూడు ఫార్మాట్లలో సిరీస్ జరగడం ఎనిమిదేళ్ల తరువాత ఇదే మొదటిసారి. 2009లో భారత్ లో శ్రీలంక పర్యటించింది. అప్పుడు మూడు టెస్టుల సిరీస్ తో పాటు, ఐదు వన్డేల సిరీస్, రెండు ట్వంటీ 20ల సిరీస్లు ఇరు జట్ల మధ్య జరిగాయి. అది ఇరు జట్ల మధ్య జరిగిన పూర్తిస్థాయి చివరిసిరీస్. కాగా, రెండేళ్ల క్రితం శ్రీలంకలో భారత్ పర్యటించినప్పటికీ టెస్టు సిరీస్, వన్డే సిరీస్ మాత్రమే జరిగింది.

Back to Top