తొలి బంగ్లాదేశ్ క్రికెటర్ గా..

Shakib became  the first cricketer from Bangladesh in MCC World Cricket Committee

లండన్:బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీలో కాంప్లిమెంటరీ బాడీగా పని చేసే మెర్లీబోన్(ఎంసీసీ) వరల్డ్ క్రికెట్ కమిటీలో షకిబుల్ కు చోటు లభించింది. తద్వారా ఈ కమిటీలో స్థానం సంపాదించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్ గా షకిబుల్ గుర్తింపు పొందాడు. ఈ మేరకు షకిబుల్ కు చోటు కల్పించిన విషయాన్ని ఎంసీసీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. బంగ్లాదేశ్ అత్యుత్తమ ఆటగాళ్లలో షకిబుల్ ఒకడు. 2000ల్లో బంగ్లాదేశ్ టెస్టు హోదా పొందిన తరువాత షకిబుల్ ఆ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇప్పటివరకూ షకిబుల్ 51 టెస్టులు ఆడగా, 177 వన్డేల్లో పాల్గొన్నాడు. దీనిపై షకిబుల్ మాట్లాడుతూ తనకు ఎంసీసీలో సభ్యత్వం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు.ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ క్రికెట్ కమిటీలో చోటు లభించడం నమ్మలేకుండా ఉన్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలోనే ఎంసీసీ కొత్త చైర్మన్ గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ గాటింగ్ కు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ మేరకు గత మే నెలలో నిర్ణయం తీసుకున్నా అధికారికంగా గాటింగ్ కు బాధ్యతలు అప్పచెప్పారు. ఇంగ్లండ్ కే చెందిన మాజీ కెప్టెన్  మైక్ బెర్లీ నుంచి గాటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ కమిటీ ఐసీసీకి అనుబంధంగా పనిచేస్తోంది. స్వయం ప్రతిపత్తిగల ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ క్రికెట్ లో మార్పులకు పలు సూచనలు తెలియజేయడంతో పాటు, ఐసీసీ హోదా కల్గిన టెస్టు దేశాల నుంచి ఫిర్యాదులు సేకరించడం అందుకు అనుగుణంగా పనిచేయడం దీని కర్తవ్యం.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top