ఒకే రోజు 14 వికెట్లు!

second Test between Sri Lanka and Bangladesh - Sakshi

శ్రీలంక 222, బంగ్లాదేశ్‌ 56/4 

ఢాకా: శ్రీలంక, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన తొలి టెస్టులో పరుగుల వరద పారడంతో ఐసీసీ చిట్టగాంగ్‌ పిచ్‌ను నాసిరకంగా తేల్చింది. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా రెండో టెస్టులో బౌలర్ల ప్రతాపం మొదలైంది. ఇక్కడి షేర్‌ ఎ బంగ్లా స్టేడియంలో గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజే 14 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక 222 పరుగులకే ఆలౌట్‌ కాగా... అనంతరం ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ముందుగా బంగ్లా బౌలర్లు రజాక్‌ (4/63), తైజుల్‌ ఇస్లామ్‌ (4/83), ముస్తఫిజుర్‌ రెహమాన్‌ (2/17)ల ధాటికి లంక విలవిల్లాడింది. కుషాల్‌ మెండిస్‌ (68; 10 ఫోర్లు, 1 సిక్స్‌), రోషన్‌ సిల్వా (56; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతావారు విఫలమయ్యారు. బంగ్లా ఇన్నింగ్స్‌ కూడా సాఫీగా సాగలేదు. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (4), ఇమ్రుల్‌ కైస్‌ (19) లతో పాటు తొలి టెస్టు హీరో మోమినుల్‌ హక్‌ (0), ముష్ఫికర్‌ రహీం (1) కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌ చేరారు. లంక బౌలర్లలో లక్మల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం లిటన్‌ దాస్‌ (24 బ్యాటింగ్‌), మెహదీ హసన్‌ (5) క్రీజులో ఉన్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top