ఫైనల్లో శాట్స్‌ సీమర్స్, ఆదిలాబాద్‌ ఆరోస్‌

Sat Seamers to Fight with Adilabad Aros in Final - Sakshi

తెలంగాణ గోల్డ్‌కప్‌ క్రికెట్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గోల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆదిలాబాద్‌ ఆరోస్, శాట్స్‌ సీమర్స్‌ జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. సోమవారం జరిగిన తొలి సెమీస్‌లో రాజన్న రాయల్స్‌పై 16 పరుగుల తేడాతో ఆదిలాబాద్‌ ఆరోస్‌ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆదిలాబాద్‌ ఆరోస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు సాధించింది. కిరీటి (24 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్‌), చరణ్‌ తేజ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కన్నా (17 బంతుల్లో 23; 4 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో పి. రాజు, ఇ. రాజు చెరో 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం 145 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రాజన్న రాయల్స్‌ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులే చేసి ఓడిపోయింది.

పి. రాజు (33 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), వి. విష్ణు (30 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. ఆదిలాబాద్‌ బౌలర్లలో అన్వేష్, కిరీటి చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. కిరీటి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.  అనంతరం జరిగిన రెండో సెమీస్‌లో కాకతీయ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో శాట్స్‌ సీమర్స్‌ విజయం సాధించింది. తొలుత కాకతీయ కింగ్స్‌ 19 ఓవర్లలో 127 పరుగులు చేసింది. అఖిల్‌ (39; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. ప్రత్యర్థి బౌలర్లలో రాజేశ్‌ 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం శాట్స్‌ సీమర్స్‌ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు చేసి గెలుపొందింది. షోయబ్‌ (28 బంతుల్లో 49; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడగా, యశ్‌ (38; 5 ఫోర్లు) అతనికి చక్కని సహకారం అందించాడు. రాజేశ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. ఈ రెండు జట్ల మధ్య శనివారం ఎల్బీ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top