మెరుగైన శిక్షణ అందించడమే నాదల్‌ లక్ష్యం 

Sakshi Interview With Nadal Foundation In Anantapur

సాక్షి,  అనంతపురం : మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా నాదల్‌ ఫౌండేషన్‌ ముందుకు సాగుతోందని స్పెయిన్‌కు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు జొనాథన్‌ మార్ట్, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధి హ్యూగో కమిన్‌ తెలిపారు. భవిష్యత్తు తరాలకు మంచి అలవాట్లను పెంపొందించడంలో క్రీడలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.

అనంతపురం క్రీడా మైదానంలో ప్రపంచ స్థాయి టెన్నిస్‌ దిగ్గజం రాఫెల్‌ నాదల్‌ 2010 అక్టోబర్‌ 17న టెన్నిస్‌ ఫౌండేషన్‌ అకాడమీని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకూ వెయ్యి మంది క్రీడాకారులను టెన్నిస్‌లో తీర్చిదిద్దారు. టెన్నిస్‌ క్రీడను నేర్చుకునే విద్యార్థులకు ఆటతోపాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, స్పోకెన్‌ ఇంగ్లిష్, సామాజిక స్పృహ కలిగిన అంశాలపై తర్ఫీదునిస్తున్నారు. అంతేకాక కోచింగ్‌కు హాజరయ్యే క్రీడాకారులకు ఉచితంగా న్యూట్రీషన్‌ను వారే అందిస్తున్నారు.

గతంలో అనంత క్రీడా మైదానానికే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది ఒక కేంద్రంలో క్రీడా శిబిరాన్ని నిర్వహించగా, ఈ ఏడాది రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాల, అనంతపురం నంబర్‌ 1 ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్ర మునిసిపల్‌ హైస్కూల్‌లో శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షిస్తున్న జొనాథన్‌ మార్ట్, హ్యూగో కమిన్‌తో ‘సాక్షి చిట్‌చాట్‌’..

సాక్షి: జిల్లా క్రీడాకారులను ఎలా సిద్ధం చేస్తున్నారు? 
జవాబు: కేవలం క్రీడ ద్వారానే కాకుండా సమాజంలో వారి బాధ్యత ఏమిటో తెలిసుకునేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నాం. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొనే విధంగా శిక్షణ ఇస్తున్నాం.  

సాక్షి: నాదల్‌ ఫౌండేషన్‌ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటో చెప్పగలరా? 
జవాబు: సమాజానికి శక్తివంతమైన యువతను సిద్దం చేసి అందించడమే నాదల్‌ ఫౌండేషన్‌ ప్రధాన లక్ష్యం. ఈ ఫౌండేషన్‌ను రఫా నాదల్‌ 2010 అక్టోబర్‌ 17న అనంతపురంలో ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఫౌండేషన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇందులో పాల్గొనే క్రీడాకారులకు శిక్షణ, నైపుణ్యాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించి వారిని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతున్నాం.  

సాక్షి: టెన్నిస్‌ శిక్షణ ఉచితమా? 
జవాబు : ఇది పూర్తీ ఉచితం. దీనిని రఫెల్‌ నాదల్‌ ఫౌండేషన్‌ ద్వారా నడిపిస్తున్నాం. ఇందులో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికీ క్రీడ పరంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాం. కోచింగ్‌ క్యాంపులకు హాజరయ్యే క్రీడాకారులకు వాహన సదుపాయాన్ని కూడా కల్పించాం.    

సాక్షి: జిల్లా వ్యాప్తంగా టెన్నిస్‌ను విస్తరించనున్నారా?  
జవాబు : గత 10 ఏళ్ల ప్రయాణంలో 8 ఏళ్లు అనంత నగరానికి పరిమితమయ్యాం. గత ఏడాది రెండు పాఠశాలల్లో ప్రత్యేక శిభిరాలు నిర్వహించి టెన్నిస్‌ క్రీడ పట్ల ఆసక్తి ఉన్న వారిని గుర్తించాం. ఈ ఏడాది మరో మూడు ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు టెన్నిస్, సామాజిక అంశాలు, మానవీయ విలువలపై చైతన్య పరిచాం.  

సాక్షి: ఇక్కడి కోచ్‌లతో కో ఆర్డినేషన్‌ ఎలా ఉంది? 
జవాబు : మేము నిర్వహించే శిబిరాలు ప్రధానమైనవి కావు. ఇక్కడి నాదల్‌ అకాడమీలో ఉన్న కోచ్‌లను సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నాం. మా లక్ష్యాలను ముందుగా వారికి వివరిస్తాం. ఆ తర్వాత వారే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు. ఆలోచన మాది, ఆచరణలో మాత్రం వారు సూచించిన విధానాలను అవలంభిస్తుంటాం. ఒకరి ద్వారా అనేకం అనే సిద్ధాంతంతో ముందుకు పోతున్నాం.  
సాక్షి: సామాజిక మార్పు ఎలా సాధ్యమవుతుంది?  
జవాబు : సమాజంలో విద్యార్థులు చాలా కీలకం. వారే ఈ సమాజాన్ని, దేశాన్ని మార్చే ఏకైక శక్తి. సామాజిక విస్ఫోటాలకు కారణమైన వారిలో  మానసికంగా ఎదురవుతున్న రుగ్మతలే ప్రధానమని చెప్పవచ్చు. దీనిని అధిగమించేందుకు క్రీడలు ప్రధానం. ఈ క్రీడ నేర్పితే వారు ఆ క్రీడలో మాత్రమే రాణిస్తారు. అయితే వారికి ఇంగ్లిష్, కంప్యూటర్, మానవీయ విలువల గురించి తెలపడం ద్వారా శక్తివంతమైన పౌరులుగా ఎదుగుతారు. దీని ద్వారా సామాజిక మార్పు సిద్ధమవుతుంది.  

సాక్షి: ఉత్తమ క్రీడాకారుడిగా రాణించేందుకు ఏమి చేయాలి? 
జవాబు : క్రీడాకారుడిలో ఉన్న ఆసక్తి అతనిని ఉన్నత శ్రేణికి చేరుస్తుంది. సాధన అనేది ప్రధానం. కోచ్‌ ఇచ్చే సూచనలను ఫాలో అయితే ఆ క్రీడాకారుడు ఆటలో రాణించగలడు. ఫిట్‌నెస్‌ తప్పనిసరి. మానసిక స్థితిని ఎప్పటికప్పుడు ఆధీనంలో ఉంచుకోవాలి. ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఉత్తమ క్రీడాకారిడిగా రాణించవచ్చు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top