నా అత్యుత్తమ కెప్టెన్ అతనే: సచిన్

నా అత్యుత్తమ కెప్టెన్ అతనే: సచిన్


ముంబై:భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ది 24 ఏళ్ల క్రికెట్ ప్రస్థానం. అంతర్జాతీయ క్రికెట్ లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో తిరుగులేని రికార్డులను లిఖించుకుని ప్రపంచ క్రికెట్ ను శాసించిన క్రికెటర్. తన క్రికెట్ కెరీర్ లో చాలా మంది మేటి కెప్టెన్లతో ఆడిన అనుభవం సచిన్ కు ఉంది. ఎంతోమంది లెజెండ్ కెప్టెన్లతో ఆడిన సచిన్ .. ఇంగ్లండ్ మాజీ సారథి నాసీర్ హుస్సేన్ కే ఓటేశాడు. తాను చూసిన  కెప్టెన్లలో నాసీరే ద బెస్ట్ అని సచిన్ పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఆటో బయోగ్రఫీ పుస్తకం 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో నాసీర్ ఎందుకు బెస్ట్ అనే విషయాన్ని వివరించాడు.'అందరు కెప్టెన్లు ఒకేలా ఆలోచిస్తే నాసీర్ భిన్నంగా ఆలోచించేవాడు. ఫీల్డింగ్ దగ్గర్నుంచి, బౌలర్ చేత బౌలింగ్ చేయించే విధానం వరకూ అన్నింటిని చాలా నిశితంగా గమనించేవాడు. అతని వ్యూహాలు చాలా భిన్నంగా ఉండేవి. నేను బ్యాటింగ్ చేసే సమయంలో లెఫ్టార్మ్ స్సిన్నర్ ఆష్లే గైల్స్ తో విభిన్నమైన రీతిలో బౌలింగ్ చేయించేవాడు. అతని చేత ఓవర్ ద వికెట్ నుంచి అవుట్ సైడ్ ద లెంగ్ స్టంప్ బౌలింగ్ వేయించేవాడు. నాసీర్ ఒక మంచి ఆలోచన పరుడు అనడానికి ఇదొక ఉదాహరణ. దాంతో పాటు బ్యాట్స్ మన్ ఒక షాట్ ఆడిన తరువాత అక్కడ ఫీల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే నాసీర్ అలా చేసేవాడు కాడు.ఆ ప్లేస్ లో కచ్చితంగా ఫీల్డర్ ను పెట్టాలని నాసీర్ అనుకునే వాడు కాదు. బౌలర్ ఆలోచన ప్రకారం మనం తదుపరి బంతిని ఎలా ఆడతామో ఊహించి మాత్రమే ఫీల్డింగ్ ఏర్పాటు చేసుకునే వాడు. ఇంగ్లండ్ జట్టులో అతను నిజంగానే కచ్చితంగా భిన్నమైన వ్యక్తిగానే చెప్పొచ్చు. నా అత్యుత్తమ కెప్టెన్ అతనే'' అని సచిన్ తన పుస్తకంలో పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే ఆస్ట్రేలియా తరపున తాను ఆడిన కెప్టెన్లలో మైకేల్ క్లార్కే అత్యుత్తమ కెప్టెన్ అని సచిన్ కితాబిచ్చాడు. ఇక్కడ మార్క్ టేలర్, స్టీవ్, రికీ పాంటింగ్ వంటి హేమాహేమీలను సచిన్ పక్కన పెట్టేశాడు.

Back to Top