రోహిత్‌.. ఇలా అయితే ఎలా?

Rohit Sharma Throws Away His Wicket In Adelaide, Twitter Is Not Impressed - Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆదిలోనే తడబాటుకు గురైంది. 3 పరుగులకే తొలి వికెట్, 15 పరుగులకే మరో వికెట్‌, 19 పరుగుల వద్ద మూడో వికెట్‌, 41 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ ఇలా స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. కాగా, ఈ తరుణంలో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ శర్మ ఆకట్టుకునే యత్నం చేశాడు. తనదైన స్టైల్‌లోనే బ్యాట్‌ను ఝుళిపిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే 61 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ మూడు సిక్సర్లు, 2 ఫోర్లతో 37 పరుగులు సాధించిన తర్వాత ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. వరుసగా సిక్సర్లు కొట్టాలనే యత్నంలో రోహిత్‌ వికెట్‌ను సమర్పించుకున్నాడు. అప్పటికే కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకునే ప్రయత‍్నాన్ని చేయకుండా ఆసీస్‌ స్పిన్నర్‌ లియాన్‌పై పైచేయి సాధించాలనే తాపత్రయంలో వికెట్‌ కోల్పోయాడు. లియాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 38 ఓవర్‌ మూడో బంతికి రోహిత్‌ ఔటయ్యాడు. అంతకుముందు బంతినే సిక్స్‌ కొట్టిన రోహిత్‌.. మరుసటి బంతిని కూడా భారీ హిట్‌ చేయబోయి క్యాచ్‌ రూపంలో దొరికిపోయాడు.

ఇలా రోహిత్‌ నిర్లక్ష్యంగా ఔట్‌ కావడంపై ట్వీటర్‌లో విమర్శలు కురిపిస్తున్నారు అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు. ‘ రోహిత్‌ కెరీర్‌ పరంగా చూస్తే టెస్టు మ్యాచ్‌లో అవకాశం అనేది అతనికి ఒక అరుదైనదిగా చెప్పొచ్చు. అటువంటి అవకాశాన్ని ఇలా నిర్లక్ష్యంగా పాడుచేసుకుంటే ఎలా’ అని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ ప్రశ్నిస్తే, ‘నువ్వు కొన్ని షాట్లతో మెరుపులు మెరిపించావు. వాటిని మళ్లీ మళ్లీ రిప్లేలో ప్రదర్శించవద్దని విజ్ఞప్తి చేసుకో’ అని మరో వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్వీట్‌ చేశాడు.   ఇది టెస్టు మ్యాచ్‌ అనే సంగతిని పక్కన పెట్టి రోహిత్‌ హిట్టింగ్‌కు దిగడాన్ని హర్షాభోగ్లే వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ‘రోహిత్‌కు టెస్టు మ్యాచ్‌ అన్న విషయం ఎవరైనా చెబితే బాగుండేది’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, మరీ ఇంత నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్‌ చేరతావా’ అని మరొక అభిమాని నిలదీశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top